'స్టెమీ ప్రాజెక్ట్‌'.. గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు స్పెషల్ ఫోకస్

గోల్డెన్ అవర్‌లో గుండెపోటు నుండి ప్రజలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐసీఎంఆర్ సహకారంతో 40,000 రూపాయల విలువైన స్టెమీ ఇంజెక్షన్‌ను ఫ్రీగా అందించనుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2023 10:04 AM IST
STEMI Project, AP government, heart attack, APnews

'స్టెమీ ప్రాజెక్ట్‌'.. గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు స్పెషల్ ఫోకస్

అమరావతి: గోల్డెన్ అవర్‌లో గుండెపోటు నుండి ప్రజలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో 40,000 రూపాయల విలువైన STEMI ఇంజెక్షన్‌ను ఉచితంగా అందించనుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నంలలో సెప్టెంబర్ 29న ప్రారంభమవుతుంది. గుండెపోటు తర్వాత మొదటి గంటను 'గోల్డెన్ అవర్' అంటారు. ఈ మొదటి గంటలోపు తగిన చర్యలు తీసుకుంటే రోగి జీవితాన్ని కాపాడవచ్చు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో ఆరోగ్య శాఖ ST-ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ (STEMI) ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్‌ల సహకారంతో హబ్-అండ్-స్పోక్ మోడల్‌లో 2024 నుండి రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి వస్తాయి.

STEMI ఇంజెక్షన్ అంటే ఏమిటి?

ST-సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (STEMI)తో బాధపడుతున్న రోగులకు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (గుండెపోటు), పల్మనరీ ఎంబాలిజం, ధమనుల థ్రోంబోఎంబోలిజం వంటి సందర్భాలలో గడ్డలను విచ్ఛిన్నం చేయడానికి సిరలో స్ట్రెప్టోకినేస్ ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, ఏఎన్‌ఎంలు, కుటుంబ వైద్యులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యవస్థ గురించి తెలియజేస్తూ, గుండెపోటు లక్షణాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్‌కు తరలిస్తారు. తదనంతరం, రోగిని జిల్లా ఆసుపత్రులకు లేదా క్యాథ్ ల్యాబ్‌లు ఉన్న బోధనాసుపత్రులకు రిఫర్‌ చేస్తారు.

38 లక్షల మంది ఏపీ వాసులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు

చాలా వరకు నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సిడి) మరణాలు గుండె సంబంధిత సమస్యల వల్ల సంభవిస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 32 శాతం ఎన్‌సిడి మరణాలు గుండెపోటు కారణంగా సంభవిస్తున్నాయని తేలింది. రాష్ట్రంలో దాదాపు 38 లక్షల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు.

గుండెపోటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా, ప్రజలకు కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, పీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో గుండె చికిత్సకు అవసరమైన ఇంజక్షన్‌ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ప్రాజెక్ట్ కింద, కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 94 కొత్త వైద్య పోస్టులను సృష్టించింది. సమీప పిహెచ్‌సిలలో ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంచడం, గోల్డెన్‌ సమయంలో రోగికి ఉచితంగా ఇంజెక్షన్లు ఇవ్వడం, అనంతరం 100 కి.మీ.లోపు క్యాథ్‌ల్యాబ్‌లు ఉన్న జిల్లా హబ్‌ ఆసుపత్రికి తరలించడం, గ్రామస్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అవసరమైన పరీక్షలు, శస్త్రచికిత్సలను నిర్వహించడం వంటివి చేస్తారు.

ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది

రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకం కూడా చేపట్టింది. 120 కోట్లతో క్యాథ్ ల్యాబ్‌లను నిర్మించారు. ఎస్‌విఆర్‌ఆర్ జిజిహెచ్ గుంటూరు, జిజిహెచ్ కర్నూలు, కెజిహెచ్ విశాఖపట్నంలను నాలుగు హబ్‌లుగా ఏర్పాటు చేశారు. ఈ జిల్లాల్లో 61 స్పోక్స్‌లను ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజలకు, గ్రామీణ ప్రజలకు కూడా గుండె సంరక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో 13, కర్నూలులో 16, గుంటూరులో 15, విశాఖపట్నంలో 17 స్పోక్స్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

Next Story