వారి నాయకత్వంలోనే కరువు సీమ సస్యశ్యామల రత్నాల సీమగా మారింది

దార్శనికుడైన చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేస్తున్న కాలంలోనే రాయలసీమకు జీవనాడిలా ఉన్న ప్రతి నీటి వనరుకీ పునాది వేయడం జరిగిందని తద్వారా కరువు సీమ సస్యశ్యామల రత్నాల సీమగా మారిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

By -  Medi Samrat
Published on : 6 Jan 2026 7:10 PM IST

వారి నాయకత్వంలోనే కరువు సీమ సస్యశ్యామల రత్నాల సీమగా మారింది

దార్శనికుడైన చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేస్తున్న కాలంలోనే రాయలసీమకు జీవనాడిలా ఉన్న ప్రతి నీటి వనరుకీ పునాది వేయడం జరిగిందని తద్వారా కరువు సీమ సస్యశ్యామల రత్నాల సీమగా మారిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి సాగునీటి రూపంలో కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా శాశ్వత పరిష్కారాన్ని చూపిన నాయకుడు నందమూరి తారకరామారావు అన్నారు. 1983లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన రాయలసీమ కరువును నివారించేందుకు సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమని గుర్తించి, దూరదృష్టితో తెలుగు గంగ, హంద్రీ–నివా, గాలేరు–నగరి, వెలుగోడు బ్యాలెన్సర్, గోరకల్లు, అవుకు, గండికోట వంటి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆ మార్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులను విస్తరించి, రాయలసీమ సాగునీటి కలను సాకారం చేసే దిశగా అహర్నిశలు కృషి చేశారన్నారు. నేడు రాయలసీమలో ఏ ప్రాజెక్ట్, రిజర్వాయర్ పేరు పలికినా ప్రజలకు గుర్తుకువచ్చేది ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమకు జీవనాడిలా మారిన ప్రతి నీటి వనరుకీ వీరిద్దరి ప్రణాళిక, పట్టుదల, పరిపాలనా దక్షతే పునాది అన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాగునీటి ప్రాజెక్టులపై చూపిన ప్రత్యేక శ్రద్ద కారణంగా రాయలసీమలోని జలాశయాలు, చెరువులు అన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయన్నారు. రాయలసీమలోని 17 ప్రధాన రిజర్వాయర్లలో 86% , మధ్యస్థాయి రిజర్వాయర్లలో 67%, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో 53% నీరు నిల్వగా ఉందన్నారు. మొత్తం రాయలసీమ నీటి నిల్వ సామర్థ్యం 464 టీఎంసీలు కాగా, వాటిలో 366 టీఎంసీలు (79%) ప్రస్తుతం నిండుగా ఉన్నాయన్నారు. ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న సమర్థ నీటి నిర్వహణ చర్యలకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

హంద్రీ–నివా ప్రాజెక్ట్, రాయలసీమకు జీవనాడిగా పరిగణించదగ్గదని, 2019 నాటికే 3850 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపులు సిద్ధంగా ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ పాలనలో ఆ పంపులను వినియోగించకపోవడం వల్ల రాయలసీమ రైతులపై ద్రోహం చేయడం జరిగిందన్నారు. గత ఐదు సంవత్సరాల పాలనలో హంద్రీ–నివాకు కేవలం రూ.514 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం ఒక సంవత్సరంలోనే రూ.3880 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అదేవిధంగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరన్నర కాలంలో రూ.3145 కోట్లు అదనంగా వెచ్చించి కృష్ణమ్మ నీరు కుప్పం బ్రాంచ్ కెనాల్ చివరి మైలు వరకు, అలాగే మడకసిర బ్రాంచ్ కెనాల్ (490 కి.మీ) వరకు ప్రవహించేలా చేసి, రాయలసీమ రైతుల కలలను నెరవేర్చడం జరిగిందన్నారు.

అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్, అవుకు రిజర్వాయర్ వంటి ప్రాజెక్టులు గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వీటిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టి గోరకల్లు రిజర్వాయర్‌కు రూ.58.50 కోట్లు, అవుకు రిజర్వాయర్‌కు రూ.4.5 కోట్లు, అలగనూరుకి రూ.36 కోట్లు, తుంగభద్ర ప్రాజెక్ట్ మరమ్మతులకు రూ.54.42 కోట్లు మరియు శ్రీశైలం ప్లంజ్‌పూల్ మరమ్మతులకు రూ.203 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పింఛ ప్రాజెక్ట్ కొట్టుకుపోయి, దాని ప్రభావంతో అన్నమయ్య ప్రాజెక్ట్ విరిగి 39 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించలేకపోయారన్నారు. కానీ అధికారంలో లేని చంద్రబాబు నాయుడు స్వయంగా అక్కడికి వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారని, ఇదే ప్రజానాయకత్వం అన్నారు.

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల భద్రతా పరిరక్షణ దిశగా కూటమి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందని, తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయినప్పుడు కేవలం ఐదు రోజుల్లో కొత్త స్టాప్‌లాక్ గేట్ అమర్చడం, శ్రీశైలం ప్రాజెక్ట్ ప్లంజ్‌పూల్ మరమ్మతులకు ₹203 కోట్లు కేటాయించడం అనేది తమ ప్రభుత్వం చురుకుదనం, బాధ్యతాయుత పరిపాలనకు సంకేతాలు అన్నారు.

ఈ విధంగా రాయలసీమలోని ప్రతి సాగునీటి ప్రాజెక్ట్, రిజర్వాయర్ పునరుద్దరించబడుచున్నాయని, చెరువులు, ట్యాంకులు నిండిపోతున్నాయన్నారు. రైతులు రెండో పంట కూడా సాగు చేయగలుగుతున్నారన్నారు. ఒకప్పుడు కరువు సీమగా పేరుపొందిన రాయలసీమ, ఈరోజు సస్యశ్యామల రత్నాల సీమగా మారే మార్గంలో ఉందన్నారు.

గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలో నిర్లక్ష్యాని గురైన అన్ని ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం కేవలం ఒక సంవత్సరంలోనే వేల కోట్ల పెట్టుబడులు పెట్టి, ప్రాజెక్టుల పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇది రాయలసీమ రైతుల జీవితాల్లో నీటి రూపంలో పునర్జీవాన్ని నింపిన చారిత్రాత్మక మార్పుగా నిలిచిందన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరు…

రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులు చేస్తున్న అసత్య ప్రచారాంలో ఏమాత్రం పసలేదని, వారి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మరని మంత్రి పేర్కొన్నారు. ఆ పథకానికి సంబందించిన వాస్తవాలను ఆయన తెలియజేస్తూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇప్పటికే 841 అడుగుల స్థాయివరకు గ్రావిటీ పద్ధతిలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఎటువంటి లిఫ్టింగ్ అవసరం లేకుండా నీరు రాయలసీమకు వస్తోందన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 2020లో ప్రతిపాదించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మాత్రం 800 అడుగుల స్థాయి నుంచి మాత్రమే నీటిని లిఫ్ట్ చేసే విధంగా రూపుదిద్దుకుందన్నారు. ఆ స్థాయిలో లభించే నీటి పరిమాణం కేవలం 34 టీఎంసీలు మాత్రమేనని, అందులోనూ కృష్ణా నది బోర్డు కేటాయించిన వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు దక్కేది 66% అంటే కేవలం 22 టీఎంసీలు మాత్రమే అని ఆయన తెలిపారు. ఈ నీటిని కూడా ఇప్పటికే ఉన్న మాల్యాల (834 ఫీట్) మరియు ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా లభ్యమయ్యే నీటి సామర్థ్యంతోనే రాయలసీమకు ఆందించడం జరుగుతోందన్నారు. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ద్వారా అదనంగా నీటి లబ్ధి పెద్దగా ఏమీ ఉండబోదన్నారు.

ఈ ప్రాజెక్టుకు 2020లో రూ.3,850 కోట్ల పరిపాలన అనుమతి ఇచ్చి, ఎటువంటి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) లేకుండా, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ (EC) లేకుండా గత ప్రభుత్వం పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఫలితంగా 2020 మే 20న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) పనులు నిలిపివేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. 2024 మార్చిలో NGT తిరిగి రూ.2.65 కోట్ల జరిమానా విధించిందన్నారు. ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు.

ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల పేరుతో రూ.990 కోట్లు ఖర్చుచేసినట్టు రికార్డులు ఉన్నాయని, ఇందులో సివిల్ పనుల కోసం రూ.390 కోట్లు, మెకానికల్ పనుల కోసం రూ.283 కోట్లు, బ్యాంకు వడ్డీగా రూ.134 కోట్లు, ఇతర ఖర్చుల పేరుతో రూ.183 కోట్లు వినియోగించడం జరిగిందన్నారు. కానీ ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకు రాలేదన్నారు.

అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో జిఎన్ఎస్ఎస్-టు-హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్ట్ (రూ.5,036 కోట్లు) పేరుతో భూసేకరణ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా మట్టి పనులు మాత్రమే చేసి కోట్ల రూపాయలను దుర్వినియోగం చేయడం జరిగిందన్నారు. ఎక్కడ సాఫ్ట్ సోయిల్ ఉందో అక్కడే పనులు చేసి రూ.1067.74 కోట్ల విలువైన బిల్లులను క్లియర్ చేయించుకోవడం జరిగిందన్నారు.

అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ముదివేడు రిజర్వాయర్ (అంచనా ₹500 కోట్లు, ఖర్చు ₹167.97 కోట్లు), నేటిగుంటపల్లి రిజర్వాయర్ (అంచనా ₹571 కోట్లు, ఖర్చు ₹494 కోట్లు) మరియు ఆవులపల్లి రిజర్వాయర్ (అంచనా ₹482 కోట్లు, ఖర్చు ₹28 కోట్లు) అనే మూడు కొత్త రిజర్వాయర్ల నిర్మాణ పనులను పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టడం జరిగిందన్నారు. ఈ మూడు రిజర్వాయర్ల పనులకు సుమారు రూ.700 కోట్ల ఖర్చు పెట్టి, అనుమతులు లేకపోవడంతో NGT ₹100 కోట్ల జరిమానా విధించిందన్నారు. భూసేకరణలో రైతులకు ఒక్క రూపాయి పరిహారం ఇవ్వకుండా భూములు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ విధంగా గత ఐదు సంవత్సరాల్లో రాయలసీమ అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేయడం జరిగిందన్నారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనివా, గోరకల్లు, అవుకు, అలగనూరు, శ్రీశైలం, తుంగభద్ర వంటి ప్రధాన ప్రాజెక్టులకు పునరుద్ధరణ చర్యలు చేపట్టి, భద్రతా పనుల కోసం రూ.3880 కోట్లు హంద్రీనివాకు, రూ.203 కోట్లు శ్రీశైలంకు, రూ.55 కోట్లు గోరకల్లు రిజర్వాయర్‌కి, రూ.36 కోట్లు అలగనూరుకు మరియు రూ.54 కోట్లు తుంగభద్ర మరమ్మతులకు కేటాయించడం జరిగిందన్నారు.

అదనంగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద లైనింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వీటి ద్వారా నీటి రవాణా సామర్థ్యం రెండింతలు పెరిగి, వరద కాలంలో సముద్రంలో కలిసిపోయే కృష్ణా నీటిని రాయలసీమ రిజర్వాయర్లలో నిల్వ చేయగలుగుతామన్నారు. అలాగే గోదావరి వరద జలాల (ప్రతీ సంవత్సరం 3,000–4,000 టీఎంసీలు) వినియోగానికి పోలవరం–బొల్లాపల్లి–కృష్ణ లింక్ ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. బొల్లాపల్లి రిజర్వాయర్ (178 టీఎంసీ సామర్థ్యం) ద్వారా రాయలసీమ, బనకచర్ల, నల్లమలసాగర్ ప్రాంతాలకు నీరు అందించాలన్నది ప్రభుత్వ దృక్పథం అన్నారు.

Next Story