పీ4ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థ.. సీఎం చైర్‌పర్సన్‌గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్‌పర్సన్‌గా ‘స్టేట్ లెవెల్ సొసైటీ’

పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘జీరోపావర్టీ-పీ4’ కార్యక్రమాన్ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

By Medi Samrat
Published on : 8 April 2025 5:19 PM IST

పీ4ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థ.. సీఎం చైర్‌పర్సన్‌గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్‌పర్సన్‌గా ‘స్టేట్ లెవెల్ సొసైటీ’

పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘జీరోపావర్టీ-పీ4’ కార్యక్రమాన్ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి ‘స్టేట్ లెవెల్ సొసైటీ’ని ఏర్పాటు చేస్తోంది. దీనికి ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. అలాగే సీఈవో, డైరెక్టర్‌... వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, టెక్ టీమ్, ప్రోగ్రాం టీమ్, వింగ్ టీమ్ ఉంటాయి. జిల్లా చాప్టర్‌కు జిల్లా మంత్రి చైర్‌పర్సన్‌గా, నియోజకవర్గ చాప్టర్‌కు ఎమ్మెల్యే చైర్‌పర్సన్‌గా, గ్రామ, వార్డు స్థాయిలో సెక్రటేరియట్ చాప్టర్లకు చైర్‌పర్సన్‌‌గా పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఉంటారు. రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు, పీ4 పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు మార్గదర్శిలను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని చెప్పారు. దాతలు ఎవరెవరు ఎంత మొత్తం ఇచ్చారు... ఇంకెంత సాయం ‘బంగారు కుటుంబాలు’కు అవసరం అవుతుంది వంటి విషయాలు అన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో పారదర్శకంగా ఉంటుందని, పీ4పై విశ్వాసం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

5 లక్షల బంగారు కుటుంబాల దత్తత లక్ష్యం :

ఆగస్ట్ 15 కల్లా 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మార్గదర్శి, బంగారు కుటుంబాల నమోదు చేపడుతున్నట్టు సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం మిలాప్, డొనేట్‌కార్ట్, రంగ్‌దే సంస్థలు ప్లేయర్లుగా పీ4లో భాగస్వాములు అవుతున్నాయని తెలిపారు. దాతలు కుటుంబాలను, మండలాలను, గ్రామాలను కూడా దత్తత తీసుకోవడంతో పాటు, నిధులు సమకూర్చేలా పీ4 రూపకల్పన చేశామన్నారు. దాతలు తాము ఎవరికి ఆర్ధికంగా సాయం చేయాలి అనుకుంటున్నారో... ఆన్ లైన్ ద్వారా కూడా వారికి సాయం అందించే అవకాశాన్ని కల్పించామన్నారు. దాతలు ముందుగా పీ4 ప్లాట్ ఫామ్ ద్వారా లాగిన్ అవ్వడంతో ప్రక్రియ ప్రారంభమవుందని చెప్పారు. ఆగస్ట్ నాటికి ఈ నమోదు ప్రక్రియ పూర్తి చేసి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను నిర్దేశించారు. వచ్చే ఉగాది నాటికల్లా పీ4 కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో ఏం సాధించామనే దానిపై వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేయాలని స్పష్టం చేశారు.

Next Story