స్వర్ణాంధ్ర అభివృద్ధికి మద్దతివ్వాలి..బ్యాంకర్లను కోరిన సీఎం చంద్రబాబు

వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 29 April 2025 4:45 PM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, State-level bankers meeting

స్వర్ణాంధ్ర అభివృద్ధికి మద్దతివ్వాలి..బ్యాంకర్లను కోరిన సీఎం చంద్రబాబు

వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఓవైపు స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు అనుగుణంగా పనిచేస్తూనే... మరోవైపు 2029 కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని సీఎం చెప్పారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతివ్వాలని, 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్‌ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని మంగళవారం సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి, 2025-26 లక్ష్యాలను నిర్దేశించారు. నూరు శాతం లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు ముఖ్యమంత్రి బ్యాంకర్లను అభినందించారు. సమావేశంలో 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి ‘ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్‌’ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా తరచూ ఎస్‌ఎల్‌బీసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం... రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడగట్టేందుకేనని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సేవలు, పరిశ్రమల రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని... కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాధాన్యతలు మారాయని... ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ ఆధారిత రాష్ట్రం కావడం, దీనిపై ఎక్కువమంది ఆధారపడి జీవిస్తుండటంతో వ్యవసాయరంగానికి అండగా నిలిచామన్నారు. వ్యవసాయ అనుబంధరంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

ఇంటికో ఎంట్రప్రెన్యూర్‌ను తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆశయం మేరకు క్రెడిట్ ప్లాన్ అమలు చేస్తున్నామని... ఈ ఆర్ధిక సంవత్సరంలో కచ్చితంగా లక్ష్యాన్ని అధిగమిస్తామని ముఖ్యమంత్రికి బ్యాంకర్లు తెలిపారు. ప్రత్యేకంగా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. స్వయం సహాయక బృందాలకు రుణాలు విరివిగా అందిస్తున్నామని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్, హౌసింగ్ విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు.

Next Story