ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరగాల్సి ఉన్న గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా అభ్యర్థులు చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది. అటు రోస్టర్ అంశంపై హైకోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి 10వ తేదీన జరగనుండగా.. అప్పటివరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళనలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు లేఖ రాసింది.
అయితే గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్ వాయిదా పడినట్లు అంతకుముందు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పరీక్షపై జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సైతం స్పందించారు. ఎగ్జామ్ వాయిదా అంశంపై న్యాయ సలహాలు తీసుకుని అభ్యర్థులకు న్యాయం చేస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
కాగా రోస్టర్‌లో తప్పులు సరిచేయకుండా గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించొద్దని అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించకపోతే ఇది భవిష్యత్తులో తమ ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తుందని వాపోయారు. గ్రూప్ 2 మెయిన్స్ లోని రోస్టర్ విధానంలో లోపాలున్నాయని, వీటిని సరిచేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందిచాలని కొద్దిరోజులుగా అభ్యర్థులు కోరడంతో ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.