తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ కోటాను రేపు విడుదల చేయనుంది.
జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి గదుల కోటాను అదే రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు తమ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
ఈసారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 30, 31, జనవరి 1 తేదీల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ సర్వదర్శనం టోకెన్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో కేటాయించినట్లు టీటీడీ తెలిపింది.