ప్రాంతం పేరు చెప్పి మాట్లాడేవాళ్లకు సిగ్గుండాలి : శ్రీకాంత్ రెడ్డి
Srikanth Reddy Fires On Somu Veerraju. సోము వీర్రాజు కామెంట్స్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
By Medi Samrat Published on 28 Jan 2022 1:04 PM GMTసోము వీర్రాజు కామెంట్స్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకోవాలని హితువు పలికారు. సోము వీర్రాజు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ప్రాంతం మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దని సూచించారు. అందరినీ గౌరవించే ప్రాంతం ఇదని.. కడప ప్రజలు హత్యలు చేసేవారని అనడం దారుణం అని అన్నారు. సోము వీర్రాజు వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు.
ఎయిర్ పోర్టు ఇచ్చే వ్యక్తి సోము వీర్రాజు కాదు.. బ్రిటీష్ హయాంలోనే కడపలో ఎయిర్ పోర్టు ఉందని అన్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే కడప గూండాలు, రౌడీలు అన్నారు. ప్రాంతం పేరు చెప్పి మాట్లాడేవాళ్లకు సిగ్గుండాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాయలసీమ సంస్కృతి తెలియకుంటే చరిత్ర చదవండి.. సినిమా వాళ్లు లాభాలు కోసం ఫ్యాక్షన్ చూపి తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప ప్రజలు అందర్నీ గౌరవించే వ్యక్తులని.. సోము వీర్రాజు క్షమాపణ చెప్పకపోతే ఆయనకు గౌరవం ఉండదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
ఇదిలావుంటే.. సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనను తప్పు పట్టారు. చివరికి కడపలో కూడా విమానాశ్రయాన్ని తమ బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిందని సోము వీర్రాజు అన్నారు. ప్రాణాలను తీసేసే వారి జిల్లాలో కూడా ఎయిర్‌పోర్ట్ వచ్చిందని అన్నారు. కడపవాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చని, అక్కడ ఎయిర్‌పోర్ట్ చేశామని చెప్పారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పలువురు జిల్లావాసులు సోషల్ మీడియా వేదికగా ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు.