చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారు : చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
Srikanth Reddy Fires On Chandrababu. మాజీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారునిగా మారారని
By Medi Samrat Published on 30 July 2021 1:29 PM GMTమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారునిగా మారారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లేఖలు.. ఎన్టీఆర్ భవన్ లో తయారైనవే అని ఆరోపించారు. కెఆర్ఎంబీకి తెలంగాణ రాసిన లేఖ కూడా బాబు రాయించిందే అని అన్నారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా నాడు ఉమా చేత ధర్నా.. నేడు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల చేత లేఖలు రాయించింది బాబే నని అన్నారు.
రాయలసీమ ప్రాజెక్టులంటే చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం..? రాయలసీమ ప్రాజెక్టులపై దేవినేని, సోమిరెడ్డిలు తప్పితే సీమ నేతలు మాట్లాడరా..? అని ప్రశ్నించారు. మంచి పరిపాలన అందించేవారికి దేవుడు తోడుంటాడు అన్నదానికి నిండు కుండల్లా ఉన్న ప్రాజెక్టులే నిదర్శనమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులు నిండకపోతే ప్రజలకు కన్నీరు.. నిండితే బాబుకు కన్నీరు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఆపండి అంటూ సీఎం జగన్ ప్రధానికి లేఖలు రాశారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు సమర్థించే పరిస్థితి రావటం వల్లే.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు లేఖలు రాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజల ప్రయోజనాలు అన్నా, సీమ ప్రాజెక్టులు అన్నా చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష, ద్వేషం అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ చంద్రబాబు తెలంగాణ స్టాండ్ తీసుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా పూర్తిగా సమాధి అయ్యి, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి పాత్రకు ముగింపు పలికి, తెలంగా ప్రభుత్వానికి సలహాదారుని అవతారం ఎత్తారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
సొంత మామకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు నైజం అని శ్రీకాంత్ రెడ్డి తూర్పూరబట్టారు. తెలంగాణలో అధికారపక్షం, ప్రతిపక్షాలు అన్నీ కలిసి రాయలసీమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే.. చంద్రబాబు కూడా అదే స్టాండ్ తీసుకోవడం దౌర్భాగ్యం, దుర్మార్గం అని మండిపడ్డారు.