శారదా పీఠం హిందూ ధర్మంకోసం పనిచేస్తుందని, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని శారదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. శారదా పీఠానికి ఓ రాజకీయ పార్టీకి సంబంధం ఉందని అపవాదు వేశారని ఆరోపించారు. హర్యానా కురుక్షేత్ర వేదికగా విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం విజయంవంతం అయిందని చెప్పారు. కురుక్షేత్రలో లక్ష చండీ మహా యజ్ఞం ఘనంగా జరిగిందని, కలియుగంలో ఇలాంటి యజ్ఞం జరగడం అరుదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పండితులు యజ్ఞంలో పాల్గొన్నారని, లక్ష చండి యజ్ఞం, యజ్ఞ కుంభమేళా లాంటిదని అన్నారు.
ఒక పార్టీ అధికారంలోకి రావాలని యజ్ఞ యాగాదులు చేయమని దేశం సస్యశ్యామలంగా ఉండాలన్నదే తమ కోరిక అని, ప్రజల క్షేమం కోసం తమ పీఠం పాటుపడుతుందని శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. శారదాపీఠంపై కొందరు రాజకీయ ముద్ర వేయాలని చూశారని అయితే శారదాపీఠం ధర్మం వైపు నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే భారతదేశానికి విశేష ఆదరణ ఉందన్నారు. యువత ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతతో ఉండాలని సూచించారు. ఢిల్లీలో కూడా శారదాపీఠం ఏర్పాటుకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. భారతదేశంలో హిందూ ధర్మాన్ని వేగంగా వ్యాప్తి చేయాలనేదే తమ లక్ష్యమన్నారు.