టీటీడీ ధార్మిక కార్యక్రమాలు బాగున్నాయి : స్వ‌రూపానందేంద్ర సరస్వతి

TTD programs are good. లోక కళ్యాణం కోసం టీటీడీ నిర్వహిస్తున్న చతుర్వేద హవనాలు, పారాయణ కార్యక్రమాలు

By Medi Samrat  Published on  31 Jan 2023 7:19 PM IST
టీటీడీ ధార్మిక కార్యక్రమాలు బాగున్నాయి : స్వ‌రూపానందేంద్ర సరస్వతి

లోక కళ్యాణం కోసం టీటీడీ నిర్వహిస్తున్న చతుర్వేద హవనాలు, పారాయణ కార్యక్రమాలు ఇతర ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలోని పెందుర్తిలో గ‌ల శార‌దా పీఠంలో జ‌న‌వ‌రి 27 నుండి 31వ తేదీ వ‌ర‌కు చ‌తుర్వేద హ‌వ‌నం నిర్వహించారు. చివరి రోజైన మంగళవారం పూర్ణాహుతితో ఈ హవనం ముగిసింది.

శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర సరస్వతి, ఉత్త‌ర పీఠాధిప‌తి స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి అనుగ్రహభాషణం చేస్తూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలను అందిస్తున్న టీటీడీ బోర్డును, ఈఓ ఏవీ ధర్మారెడ్డిని అభినందించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, శ్రీనివాస కల్యాణాలు, వేంకటేశ్వర వైభవోత్సవాలు, వేదపారాయణం, హోమాలు, గో సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు.

టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా చ‌తుర్వేద హ‌వ‌నాలు నిర్వహిస్తామని తెలిపారు. శారదా పీఠం స్వామీజీల ఆశీస్సుల‌తో మానవాళి శ్రేయస్సు కోసం 5 రోజుల పాటు ఈ చ‌తుర్వేద హ‌వ‌నం నిర్వ‌హించామన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో 32 మంది వేద పండితులు, శాస్త్ర పండితులు పాల్గొన్నారని చెప్పారు. విశాఖ వాసులు పెద్ద సంఖ్యలో ఈ హవనాన్ని దర్శించారని, ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందని తెలియజేశారు. ఈ హ‌వ‌నంలో పాల్గొన్న భ‌క్తుల‌కు సుఖ‌శాంతులు, ధ‌న‌ధాన్యాలు, దీర్ఘాయుష్షు చేకూరుతాయ‌ని పండితులు తెలిపారని చెప్పారు.




Next Story