ఏపీలో రేపు ప్రత్యేక టీకా డ్రైవ్

Special Vaccination Drive In AP. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక టీకా డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్

By Medi Samrat  Published on  19 Jun 2021 9:46 AM GMT
ఏపీలో రేపు ప్రత్యేక టీకా డ్రైవ్

ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక టీకా డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ క్యాంపెయిన్ లో 45 ఏళ్లు పైబడిన వారితో పాటు అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకా వేయనున్నామన్నారు. రేపు ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్లు వేసేలా లక్ష్యం పెట్టుకున్నామ‌ని.. ఈ మేర‌కు అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. ఇప్పటికే ఒకే రోజు 6 లక్షలకు పైగా డోసులు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వం సాధించిందన్నారు.

నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,22,83479 మందికి టీకా వేశామని తెలిపారు. వారిలో 26,41,000 మందికి రెండు డోసులు, 71 లక్షల మంది ఒక డోసు వేశామని తెలిపారు. జూన్ నెలకు సంబంధించి 2,66,000 మందికి కొవాగ్జిన్, 2,10,000 మంది కొవిషీల్డ్ సెకండ్ డోసు వేయాల్సి ఉందన్నారు. 5,29,000 మంది అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు మొదటి డోసు వేశామన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులకు చికిత్సలు అందజేసే ఆసుపత్రుల సంఖ్య 620 నుంచి 400 వరకూ తగ్గిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2654 ఐసీయూ బెడ్లు, 13,784 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లకు కొరత లేదన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 6,946 మంది చికిత్స పొందుతున్నారన్నారు.

రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో కలిపి ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొందేవారి సంఖ్య 90.54 శాతం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 12,814 మంది చికిత్స పొందుతుంటే. 11,602 మంది ఆరోగ్య శ్రీ పథకం కింద కరోనా చికిత్సలు పొందుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో 4,475 మంది వైద్య సేవలు పొందుతుంటే, వారిలో 3,263 మంది (73 శాతం) ఆరోగ్య శ్రీ పథకం కిందచికిత్సలు పొందుతున్నారన్నారు.


Next Story
Share it