ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ తమ్మినేని సీతారాం శుక్ర‌వారం సింహాచ‌ల‌ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా స్పీక‌ర్‌కు ఆల‌య సిబ్బంది ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఆపై స్పీక‌ర్ దంప‌తులు ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌య‌ అర్చకులు స్పీక‌ర్ కు వేద ఆశీర్వాదం అందించారు. అనంత‌రం దేవస్థానం ఈవో సూర్యకళ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు ఆలయ అబివృద్ది కార్యక్రమాలను స్పీకర్ కి వివరించారు. ఆలయ అబివృద్దికి తనవంతు కృషి చేస్తానని స్పీకర్ తమ్మినేని హామీ ఇచ్చారు.

ఇదిలావుంటే.. ఇటీవ‌ల‌ స్పీక‌ర్ తమ్మినేని సీతారాం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తమ్మినేని సీతారాంకు, ఆయన భార్యకు కరోనా సోకి ఇటీవల కోలుకున్న సంగతి తెలిసిందే. అనంత‌రం తమ్మినేని ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో చికిత్స త‌ర్వాత‌ కోలుకున్నారు. తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆమె శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం సర్పంచ్‌గా గెలుపొందారు.

సామ్రాట్

Next Story