ఏపీ స్పేస్ పాలసీ 4.Oపై సీఎం సమీక్ష..లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీలకు ఆమోదం

అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపేలా పాలసీ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

By Knakam Karthik
Published on : 27 Jun 2025 7:46 AM IST

Andrapradesh, Cm Chandrababu, Space Policy 4.O, Space Cities,  Lepakshi, Tirupati

ఏపీ స్పేస్ పాలసీ 4.Oపై సీఎం సమీక్ష..లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీలకు ఆమోదం

అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపేలా పాలసీ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. గురువారం ఉండ‌వ‌ల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలన్నారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి, 2025-2035 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు.

భారతదేశ అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టడానికి విద్యార్థులను నిమగ్నం చేయడానికి, అంతరిక్ష సాంకేతికతలపై ఆసక్తిని రేకెత్తించడానికి విద్యా సంస్థలను భాగస్వామ్యం చేయవలసిన అవసరాన్ని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ప్లగ్ అండ్ ప్లే విధానంలో వినియోగించుకునేలా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలని, ఇందుకోసం టెక్నికల్ కమిటీ నియమించాలని ఆదేశించారు. కమ్యునికేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థలను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్లకు సంబంధించి టెక్నాలజీ అనుసంధానం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్‌ సోమనాథ్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. స్పేస్ విజన్ పాలసీ-2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని... అలాగే స్టార్ లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని... భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదేనని సోమనాథ్ ముఖ్యమంత్రికి తెలిపారు.

Next Story