చంద్రయ్య హత్యను రాజకీయం చేయొద్దు: ఎస్పీ విశాల్‌ గున్నీ

SP Vishal Gunny says.. Chandraya's murder should not be politicized. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ కార్యకర్త తోట చంద్ర‌య్య(36)ను ప్ర‌త్య‌ర్థులు హత్య చేసిన

By అంజి  Published on  15 Jan 2022 4:17 AM GMT
చంద్రయ్య హత్యను రాజకీయం చేయొద్దు: ఎస్పీ విశాల్‌ గున్నీ

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ కార్యకర్త తోట చంద్ర‌య్య(36)ను ప్ర‌త్య‌ర్థులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ మాట్లాడారు. చంద్రయ్య హత్యను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్తి ఎంపీపీ చింతా శివరామయ్య అని, చింతా ఆదినారాయణ, తోట శివన్నారాయణ, తోట ఆంజనేయులు, చింతా శ్రీనివాసరావు, సాని రామకోటేశ్వరరావు, సాని రఘురామయ్య, చింతా యలమంద కోటయ్యలు సహా నిందితులుగా ఉన్నారు.

"ప‌ని నిమిత్తం చంద్ర‌య్య‌ బైక్ పై ఇంటి నుంచి బ‌య‌లుదేరాడు. అప్ప‌టికే అత‌డి కోసం కాపు కాచిన ప్ర‌త్య‌ర్థులు బైక్‌కు క‌ర్ర అడ్డుపెట్టి కింద‌పడేలా చేశారు. అనంత‌రం చంద్రయ్య కింద ప‌డ‌గానే క‌త్తులు, క‌ర్ర‌ల‌తో దాడి చేసి హ‌త‌మార్చారు. హ‌త్య అనంత‌రం ప్ర‌త్య‌ర్థులు అక్క‌డి నుంచి ప‌రారు అయ్యారు." అని ఎస్పీ తెలిపారు. ఈ హత్య పథకం ప్రకారమే జరిగిందని.. నిందితులు 8 మందిని 24 గంటల్లో అరెస్ట్‌ చేశామని చెప్పారు. ఈ హత్యలో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు. గ్రామంలో రోడ్డు వేసే విషయంలో చంద్రయ్య, శివరామయ్యకు గొడవ జరిగిందని చెప్పారు. జనవరి 10వ తేదీన ఓ వేడుకకు హాజరైన చంద్రయ్య.. శివరామయ్యను చంపుతానని బెదిరించాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న శివరామయ్య తన కొడుకులు, బంధువులతో కలిసి చంద్రయ్య హత్యకు కుట్ర పన్నారని ఎస్సీ తెలిపారు.

Next Story