కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఈ మేరకు "భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కలిశారు" అని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.
ద్రౌపది ముర్ము దేశానికి రెండవ మహిళా రాష్ట్రపతి. మొదటి గిరిజన రాష్ట్రపతిగా రికార్డులలోకి ఎక్కారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది.
సోనియా గాంధీ రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగానే కలిశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముర్ము తన అధ్యక్ష ప్రసంగంలో భారతదేశ శక్తివంతమైన ప్రజాస్వామ్యం, కోవిడ్ వ్యాక్సిన్‌ల విజయగాథ, ఆత్మనిర్భర్ భారత్, మహమ్మారి తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వంటి పలు అంశాలపై మాట్లాడారు.