ప్రజా పోరు ద్వారా మోదీ అభివృద్ధి, జగన్ అవినీతిని వివరిస్తాం

SomuVeerraju Fire On AP Govt. పోలవరం ప్రాజెక్టు వద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న నిధులు ఏం చేశారని

By Medi Samrat  Published on  13 Sep 2022 10:16 AM GMT
ప్రజా పోరు ద్వారా మోదీ అభివృద్ధి, జగన్ అవినీతిని వివరిస్తాం

పోలవరం ప్రాజెక్టు వద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న నిధులు ఏం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రశ్నించారు. కుటుంబ పార్టీల కుట్రలో పోలవ‌రం ప్రాజెక్టు బలైపోతోందన్న అభిప్రాయాన్ని సోమువీర్రాజు వ్య‌క్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న‌ అనేక అంశాలు ప్రస్తావించారు. ప్రజాపోరులో ప్రధానమైన ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామ‌ని.. ఈ ప్రభుత్వ‌ ధమన కాండను ప్ర‌జ‌ల‌కు వివరిస్తామ‌ని తీవ్రస్వరంతో చెప్పారు.

రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక ధర ఆకాశాన్ని అంటుతోంది. సిమెంట్ ధరలకు ప్రభుత్వం కళ్లెం వేయడం లేదన్నారు. కేంద్రం మంజూరు చేసిన 25 లక్షల ఇళ్లు ఎందుకు వేగంగా నిర్మాణం చేయడం లేదు.. రాష్ట్ర ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన లక్షా 80 వేలు ఎందుకు ఇవ్వడంలేదని ప్ర‌శ్నించారు. టిడ్కో ఇళ్లు ఎందుకు లబ్దిదారులకు ఇవ్వకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారని ఫైర్ అయ్యారు. మద్యం అమ్మకాలకు సంబంధించి డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అనుమతించడం లేదని.. రహస్యం ఏంటని ప్రశ్నించారు.

ఉచిత రేషన్ గతంలో విధంగా అందరికీ అందించాలి. లబ్ధిదారుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తే సహించేదిలేదని హెచ్చ‌రించారు. అగ్రవర్ణ పేదలకు రేషన్ ఇవ్వడంలేదు. కోన సీమ రైల్వే లైన్ కి రాష్ట్ర ప్రభుత్వం తనవాటా ఎప్పుడు చెల్లిస్తుందో వెల్లడించాలని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాల్వల ఆధునీకరణ ఎందకు జరపడంలేదని నిల‌దీశారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సంవత్సర కాలంగా బహిరంగ లేఖలు రాసినా పట్టించుకోని తోలు మందం ప్రభుత్వాన్ని ప్రజా పోరులో దోషిగా నిలబెడతాన‌ని స‌వాల్ విసిరారు. గృహ నిర్మాణం చేసుకుంటున్న అందరికీ ఇసుకను తక్కువ ధరలకు అందించడం ద్వారా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలి.. నిర్మాణరంగ కార్మికులను ఆదుకోవాలని కోరారు.

సెప్టెంబర్17నుండి అక్టోబర్ రెండు వరకు దేశ వ్యాప్తంగా బిజెపి వివిధ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ప్రధానంగా నాలుగు అంశాలను కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలు పెట్టామ‌ని వివ‌రించారు. రాష్ట్రం లో మెగా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలను నిర్వహిస్తాం. రోగులకు మందులు, పండ్లు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. చెట్లు నాటే కార్యక్రమం, అమృత సరోవర్ కార్యక్రమం చేపడతాం. ఓకల్ ఫర్ లోకల్ పేరుతో సేంద్రీయ ఉత్పత్తులు స్టాల్స్ ను ప్రోత్సహిస్తాం. మోడీ పరిపాలన, సంక్షేమ పధకాల పై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

మోదీ పాలన, జీవితాలపై ఆర్టికల్స్ పత్రికల్లో రాయిస్తాం. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ రెండు వరకు ఐదు వేల బహిరంగ సభలు నిర్వహిస్తామ‌ని పేర్కొన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో‌ కమిటీ లు వేశాం. మాట్లాడే వక్తలకు కూడా శిక్షణ ఇచ్చి, అంశాలను కూడా వివరించాం. ప్రతి‌ అసెంబ్లీ లో ఒక వాహనం, యాభై బైక్ లు ఉండేలా‌ చుస్తామ‌న్నారు.

జాతీయ, రాష్ట్ర నేతలు, కేంద్ర మంత్రులు ఈ సభల్లో మాట్లాడేలా ప్రణాళిక సిద్దం చేశాం. ప్రజా పోరు ద్వారా మోదీ అభివృద్ధి, జగన్ అవినీతిని వివరిస్తాం. జగన్ ఎన్నికల సమయంలో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని ప్రజలకు చెబుతామ‌న్నారు. కేంద్రం జాతీయ రహదారులు వేస్తుంటే.. జగన్ గుంతలు కూడా పూడ్చలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.

కేంద్రం గ్రామీణ సడక్ యోజన‌ కింద వేసిన రోడ్లు ఎంత బాగున్నాయో ప్రజలు కూడా ఆలోచించాలని అన్నారు. తోపుడు బండ్ల మీద కూడా పేటీఎం ఉంది.జగన్ అమ్మే మద్యం దుకాణాల్లో ఎందుకు కనిపించదని ప్ర‌శ్నించారు. డిజిటల్ లావా దేవీలను వారి స్వార్ధం‌ కోసం చంపేశారు. మద్యం ద్వారా వచ్చే డబ్బంతా ఎక్కడకి వెళుతుందని ప్ర‌శ్నించారు.


Next Story