రాష్ట్రంలో అకృత్యాలు, హత్యలు సాధారణమైపోయాయి
Somu Veerraju Fire On Govt. రాష్ట్రంలో అకృత్యాలు, హత్యలు సాధారణమైపోయాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు
By Medi Samrat Published on 3 May 2022 8:42 AM GMTరాష్ట్రంలో అకృత్యాలు, హత్యలు సాధారణమైపోయాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. రేపల్లెలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. బాధితురాలి భర్త సంఘటన సమయంలో రైల్వే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా పోలీసులు పట్టించుకోకపోవటం, బయటి పోలీసులు వచ్చే లోపే అత్యాచారం జరిగిపోవటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఇటువంటి దుర్నీతి కొత్తేమీ కాదని.. వైసీపీ పాలనలో ఇటువంటి అకృత్యాలు నిత్యకృత్యమైపోతున్నాయని, అసలు ప్రభుత్వం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
విజయవాడలో డ్యూటీలో ఉన్న సిబ్బంది ఒక మానసిక వికలాంగురాలిని ఆసుపత్రిలోనే బంధించి అత్యాచారం చెయ్యటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ లు విజృంభిస్తున్నాయని, రాజమండ్రిలో రైలు దిగి ఇంటికి వెళుతున్న కార్మికుడి వద్ద ఉన్న ఫోన్ బ్లేడ్ బ్యాచ్ దొంగలు లాక్కుని, డబ్బు కోసం వెతికి, జేబులో డబ్బులు లేకుండా తిరుగుతున్నందుకు ఆగ్రహించి అతన్ని చంపేశారని.. ఇటువంటి ఘటనే గుంటూరులో మరొకటి జరిగిందని సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో యువతకు గంజాయి విస్తృతంగా దొరుకుతోందని, మాదకద్రవ్యాలు వినియోగించే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో నేరస్తులని యోగి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తోందని.. అటువంటి ప్రభుత్వం ఎపీలో ఏర్పడాలని సోము వీర్రాజు ఆకాంక్షించారు.