ప్రజాసమస్యలపై పోరాటం చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. సోమవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ రణభేరి 19వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందని.. నిరసన సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. బ్రహ్మసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేసిందన్న ఆయన.. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మార్చి నుండి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. ఒకవేళ కొన్నా సొమ్ము చెల్లించడం లేదని ఫైర్ అయ్యారు. మార్కెట్ లో బియ్యం కిలో రూ.50 కు ఆమ్మకాలు జరుపుతున్నారని.. ఈ కారణంగా రైతులు, వినియోగదారులకు కూడా నష్టం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ శాఖకు కేంద్రం నిధులు కేటాయించినా రాష్ట్రం ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నా.. ఇక్కడ అమలు కావడం లేదన్నారు.
నిరుద్యోగ సమస్య రాష్ట్రాన్ని వెంటాడుతోందని.. వివిధ శాఖల పరిధిలో అనేక ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడం లేదని అన్నారు. అన్నమయ్య డ్యాం కొట్టుకు పోవడానికి కారణ ఏంటని ప్రశ్నించిన ఆయన.. పోలవరం పరిహారం విషయంలో, సోమశిల నిరాశ్రయుల విషయంలో బీజేపీ ఉద్యమానికి సిద్ధంగా ఉందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమం కొనసాగిస్తామని సోము వీర్రాజు అన్నారు.