బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో ప్రచారానికి రావాలని జనసేన అధినేత పవన్‌ను కోరతామని అన్నారు. భవిష్యత్తులో బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయాల్లో ఉంటే సంపాదించాలి అనే ఆలోచనకు అతీతంగా ఉండాలని.. రాజకీయాలంటే సేవ అనే భావంతో ఉండాలని.. బీజేపీ ఆ దిశగానే కార్యకర్తలను తయారు చేస్తోందని అన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీటి కనెక్షన్ కోసం కేంద్రం మూడు వేల కోట్ల నిధులిచ్చిందని.. రాష్ట్రంలో 2014 నుండి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నారని.. చంద్రబాబు రాజధాని కడతామన్నారు.. కట్టలేదని.. మోదీ ఎయిమ్స్ కడతామన్నారు కట్టారని అన్నారు. అమరావతి-అనంతపురం హైవే ఏర్పాటు చేస్తున్నామన్నారు. కృష్ణా జిల్లాలో రెండు డిఫెన్స్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. బద్వేలులో రెండు జాతీయ రహదారులు వేశామని.. సంక్షేమం కేవలం జగనే కాదు మీము కూడా చేస్తున్నామని అన్నారు. రైతుకు ఆరు వేలు ఇస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం మోదీ సొత్తు అని అన్నారు. రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రం తన వాటా నిధులివ్వలేదని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది మోదీ ఒక్కరేనని సోము వీర్రాజు అన్నారు.