దేశమాత రక్షణ కోసం తమ ప్రాణాలనే పణంగా పెడుతారు జవాన్లు. ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా నిరంతరం పహారా కాస్తుంటారు. సంక్రాంతి పండక్కి సెలవుపై వస్తానన్న తెలుగు ఆర్మీ జవాన్.. జమ్మూకాశ్మీర్‌లో అమరుడయ్యారు. ఈ విషయం తెలిసిన అతడి తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. గత 14 ఏళ్లుగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు(38) భారత సైనిక దళంలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా సరిహద్దుల్లో శనివారం పహారా కాస్తుండగా చలితీవ్రత ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురైయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన సహచర జవానులు.. సపర్యలు చేసి హెలికాప్టర్‌లో ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే రెడప్ప చనిపోయినట్లు ఆర్మీ వైద్యులు ధృవీకరించారు.
ఈ విషయాన్ని అధికారులు.. జవాన్ కుటుంబీకులకు చేరవేశారు. రెడ్డప్ప నాయుడు మరణ వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. సంక్రాంతి పండక్కి సెలవుపై వస్తానన్న తన కుమారుడు విగత జీవిగా మారాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెడ్డప్పకు భార్య రెడ్డమ్మ, కొడుకు, కుమార్తె ఉన్నారు. రెడ్డప్ప మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.