రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైల్వేశాఖ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఇందుకు గూడ్స్‌ షెడ్లను ఎంచుకుని అక్కడే వ్యాపారం ప్రారంభించేందుకు సర్వీస్‌ మార్కెట్‌ ఎట్‌ రైల్‌ టెర్మినల్‌ (స్మార్ట్‌) అనే పథకం ప్రారంభించనుంది. రైలు టెర్మినళ్ల వద్ద సర్వీసు మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆహ్వానించనుంది.గూడ్స్‌ షెడ్ల వద్ద సరుకును నేరుగా వినియోగదారులకు అందించేందుకు సర్వీస్‌ ప్రొవైడర్లకు అవకాశం కల్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్‌ ఐదు ప్రాంతాల్లో గూడ్స్‌ షెడ్ల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఉత్తరాంధ్రలోని కంటకపల్లి, విజయనగరం, విశాఖ, బొబ్బిలి, శ్రీకాకుళంలలో ఈ గూడ్స్‌ షెడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.

స్మార్ట్‌ పథకం ద్వారా సర్వీస్‌ మార్కెట్‌ చేయాలనుకునేవారు సర్వీస్‌ ప్రొడైడర్లు తమ సరుకు రైల్‌ ట్రాన్స్‌పోర్టు ద్వారా గూడ్స్‌ షెడ్లకు చేరుస్తారు. అక్కడి నుంచి నేరుగా వినియోగదారులకు మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోడ్డు రవాణా కంటే రైలు ట్రాన్స్‌పోర్టు ధరలు చౌకగా మారనున్నాయి. దీంతో చౌకగా వినియోగదారులకు సరుకును అందించే అవకాశం ఉంది. సర్వీస్‌ ప్రొవైడర్లు గూడ్స్‌ షెడ్ల ద్వారా మార్కెట్‌ చేయాలనుకుంటే తమ సంస్థ పేరును కానీ, వ్యక్తిగతంగా వివరాలను ఫ్రైట్‌ ఆపరేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (ఎఫ్‌వోఐఎస్‌) ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడు ఎవరైనా నేరుగా సర్వీస్‌ ప్రొవైడర్‌ను స్మార్ట్‌ పథకం ద్వారా సంప్రదించవచ్చు. ట్రక్కులు, లాజిస్టిక్స్‌, వ్యాపారులు, రైలు రవాణాను ఉపయోగించే వినియోగదారులకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది.

కాగా, దక్షిణ మధ్య రైల్వే గత సంవత్సరం అన్ని డివిజన్ల పరిధిలోని బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్లు ఏర్పాటు చేసింది. సరుకు రవాణాలో ముఖ్యంగా ఈ బీడీయూలను భాగ్వామ్యం చేసి ఆదాయం పెంచుకుంటోంది. రైతులు, చిరు వ్యాపారులు సైతం ఇతర రాష్ట్రాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా సరుకు రవాణా చేస్తూ తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందుతున్నారు. గత సంవత్సరం సరుకు రవాణా ద్వారా ఏపీ నుంచి రైల్వే శాఖ రూ.2,600 కోట్ల ఆదాయం పొందింది. అధికంగా కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి సరుకు రవాణాలో భాగస్వామ్యం ఉంది.


సామ్రాట్

Next Story