ప్రత్యేకహోదా సాధనలో టీడీపీ, వైసీపీ ఫెయిల్..ద్రోహిగా నిలబెడతామంటూ షర్మిల హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడు..ఏపీకి ప్రత్యేక హోదా అడగడానికి ఇబ్బంది ఏంటని.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 9:23 PM ISTప్రత్యేకహోదా సాధనలో టీడీపీ, వైసీపీ ఫెయిల్..ద్రోహిగా నిలబెడతామంటూ షర్మిల హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడు..ఏపీకి ప్రత్యేక హోదా అడగడానికి ఇబ్బంది ఏంటని.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోనే సంపద సృష్టి, ఈసారైనా పార్లమెంట్లో హోదా సాధనపై గళం విప్పండి అంటూ ఆమె బహిరంగ లేఖ రాశారు. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తోన్న ప్రధాని మోడీని నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా షర్మిల రాసుకొచ్చారు. లేకుంటే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి మిమ్మల్ని ద్రోహిగా నిలబెడతామని హెచ్చరిస్తున్నట్లు షర్మిల ట్వీట్ చేశారు.
కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నాం. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న మోడీ గారు..రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఈ నెల 31 నుంచి జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మీ… pic.twitter.com/8rBrbPc7Zh
— YS Sharmila (@realyssharmila) January 30, 2025
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందని షర్మిల అన్నారు. పార్లమెంట్ వేదికగా 5 ఏళ్ల పాటూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని దివంగత నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. ఆనాడు కేంద్ర మంత్రివర్గం కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఆమోదించింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారం చేపట్టిన పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా మరుగున పడేశాయని విమర్శించారు.
రాష్ట్ర విభజన సమయంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 5 ఏళ్లు కాదు.. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాదించింది. బీజేపి అధికారంలోకి వచ్చాక ఏపీకి 10 ఏళ్ల పాటూ ప్రత్యేక హోదా అంటూ ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా 10 ఏళ్లు హోదా ఇస్తామని మాట ఇచ్చారు. హోదాతో పాటు విభజన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన NDA ప్రభుత్వం ప్రత్యేక హోదాపై మాట మార్చింది. ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అర్హత ఏపీకి లేదని, ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని మాట మార్చారు. గడిచిన 10 ఏళ్లలో హోదా కాదు కదా ఏ ప్యాకేజీలు కూడా రాష్ట్రానికి రాలేదు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి, రాజకీయ వైరుద్యాలతో ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడి దగ్గర తాకట్టు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు మోడి దగ్గర మోకరిల్లారే తప్పా ప్రత్యేక హోదా సాధించింది లేదని లేఖలో రాశారు షర్మిల.