ఏపీలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు ప్రభుత్వం అనుమతుల రూపంలో డబ్బులు వసూలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ వెల్లడించారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజంలేదని అన్నారు. వినాయకచవితి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి రుసుం వసూలు చేయడంలేదని.. గణేశ్ మండపాలు ఏర్పాటు చేయదలిచినవారు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులను సంప్రందించాలని అన్నారు. చట్టపరంగా అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. అంతకుమించి ఎలాంటి రుసుం గానీ, చందాలు గానీ తీసుకున్నా, అందుకు ప్రేరేపించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరి జవహర్ లాల్ వెల్లడించారు.
రుసుం వసూలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. మరో వైపు ఏపీలో రేపు నిరసన ప్రదర్శనలు చేయడానికి బీజేపీ సిద్ధమైంది. ఆంధప్రదేశ్ లో నిరసనలకు బీజేపీ ఏపి చీఫ్ సోమువీర్రాజు పిలుపునిచ్చారు. చవితి వేడుకలకు పరోక్ష ఆటంకాలకు ప్రభుత్వం పాల్పడుతోందని.. విఘ్నాధిపతి వేడుకులకు విఘ్నాలా ఇదేమి దుర్మార్ఘపు ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వినాయక మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం అండ్డంకులు సృష్టిస్తోందని.. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మంటపాల సంఖ్యను తగ్గించాలని చూస్తోందని అన్నారు.