బీసీలకు శుభవార్త..త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు
జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు
By - Knakam Karthik |
అమరావతి : జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికనుగుణంగా బీసీ యువతకు కూడా ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించిన నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను వివిధ బీసీ సంక్షేమ సంఘాల కార్పొరేషన్ చైర్మన్లు మంగళవారం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, అన్ని రంగాల్లో వెనుబడి ఉన్న బడుగు, బలహీన వర్గాల ఉన్నతి కోసం అన్న ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారన్నారు. ఆయన బాటలో నడుస్తున్న సీఎం చంద్రబాబు కూడా బీసీల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పోటీ పరీక్షల నిమిత్తం బీసీ నిరుద్యోగ యువతకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఉచిత శిక్షణ అందజేశామన్నారు. సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షకు కూడా ఉచిత శిక్షణ అందజేశామన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణ సత్ఫలితాలిచ్చిందన్నారు. మెగా డీఎస్సీలో 246 మంది బీసీ బిడ్డలు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారన్నారు. మరెంతో మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేసిన ఉచిత శిక్షణకు గానూ ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిందన్నారు.
త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు
జనాభా దామాషా పద్ధతి ప్రకారం వెనుకబడిన తరగతులకు స్వయం ఉపాధి యూనిట్లు కేటాయించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇటీవల జరిగిన బీసీ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, ఇదే విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు.
ఏటా ఉచిత డీఎస్సీ కోచింగ్
ఏటా డీఎస్సీ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డీఎస్సీకి సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందజేయనున్నామన్నారు. ఇందుకోసం ప్రణాళికులు సైతం సిద్ధం చేశామన్నారు. అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణ అందజేయాలని నిర్ణయించామన్నారు. అమరావతిలో అయిదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ భవనం నిర్మించనున్నామన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళదాం...
సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబునాయుడు నెరవేర్చుతున్నారని మంత్రి సవిత వెల్లడించారు. తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, ఉచితంగా మూడు సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత ఇసుక అందజేస్తున్నామన్నారు. చేనేతలకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. బీసీల అభ్యున్నతికి అందజేసే పథకాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధించగలమన్నారు.