గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆక్రమణల పేరిట పలు నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ ఉండడంతో.. ఇప్పటం గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రజలెవరూ గుంపులుగా కనిపించవద్దని హెచ్చరించారు.
ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు జరుగుతుండడం పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో స్పందించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్తులు భూమి ఇచ్చారన్న కక్షతోనే ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 4 వేల జనాభా ఉన్న చిన్న గ్రామంలో ఇప్పటికే 80 అడుగుల రోడ్డు ఉంటే, దాన్ని 120 అడుగులకు పెంచుతున్నామని చెబుతున్నారు. ఇవాళ 200 మంది పోలీసులతో భయభ్రాంతులకు గురిచేసి కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యుద్ధం మీరు మొదలుపెట్టారు. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారూ... కచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం రాబోతోంది. అప్పుడు ప్రతి వైసీపీ నేత సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని అన్నారు నాదెండ్ల మనోహర్.