ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ గురువారం క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు సాయాన్ని జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది మహిళలకు రూ. 490.86 కోట్ల ఆర్ధిక సాయం అందించబోతున్నారు.
ప్రభుత్వం ఇచ్చే ఈ నగదు సాయాన్ని పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళల ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం నిధులను విడుదల చేస్తోంది ప్రభుత్వం.
వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్దిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 491.02 కోట్లు జమ చేయగా.. నేడు 3,27,244 మంది పేద కాపు అక్కచెల్లెమ్మలకు అందిస్తున్న రూ. 490.86 కోట్లతో కలిసి మొత్తం రూ. 981.88 కోట్ల లబ్ది చేకూరనుంది.