ఏపీ మద్యం షాపుల్లో భారీగా అక్రమాలు.. ఎవరు చేసినట్లు..?
Scams In AP Wine Shop. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎక్సైజ్ సిబ్బంది మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.
By Medi Samrat Published on 10 Jun 2021 7:35 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎక్సైజ్ సిబ్బంది మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమ అమ్మకాలపై మంత్రి నారాయణస్వామి విచారణకు ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు రంగంలోకి దిగారు. షాపులో ఉన్న స్టాక్ అమ్మకాలకు సంబంధించిన లెక్కలను అధికారులు పరిశీలించారు.నెల్లూరు ప్రభుత్వ మద్యం దుకాణంలో ఏడు లక్షల రూపాయలు సిబ్బంది కాజేసినట్లు తెలుస్తోంది.
దుకాణం సూపర్ వైజర్ నారాయణ, సేల్స్ మెన్ లోకేష్, సాగర్ తమిళనాడు వ్యాపారులతో చేతులు కలిపి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. తమిళనాడుకు పంపిస్తున్న 30 వేల రూపాయల విలువైన మద్యం సీజ్ చేశారు. మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. చిత్తూరులో ఉన్న 270కి పైగా మద్యం షాపుల్లో అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఎక్సైజ్ అధికారుల సోదాల్లో రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిరూపాయలు వైన్ షాపుల్లో మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు.
చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ లెక్కల్లో లేకుండా దాదాపు 24 లక్షల రూపాయల మద్యం అమ్మాకాలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. సత్యవేడు లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో 60 లక్షల రూపాయల అక్రమాలు, గంగాధర నెల్లూరులోని నర్సాపురం మద్యం షాపులో 2.15 లక్షల అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. కాణిపాకం ప్రభుత్వ మద్యం షాపులో 8 లక్షల రూపాయల అక్రమ అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కారణంగానే ఈ అక్రమాలు జరిగాయని ఆరోపణలు కూడా వస్తున్నాయి.