గుంటూరు జిల్లాలో ద్విచక్రవాహనంపై వెలుతున్న దంపతులను అడ్డుకున్న కొందరు దుండగులు కత్తులతో వారిని బెదిరించి భర్తపై దాడి చేసి అనంతరం భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి మేడికొంటూరు అడ్డరోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు.. గుంటూరు పట్టణంలోని ఓ పెళ్లికి హాజరై తిరిగి బైక్‌పై వెలుతున్నారు. మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలోకి వచ్చేసరికి వారిని కొందరు దుండగులు అడ్డగించారు. కత్తులతో వారిని బెదిరించారు. భర్తపై దాడి చేశారు. అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పురోగతి సాధించారు. దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి, పాలడుగు దగ్గర కోల్డ్ స్టోరేజ్‌లో పనిచేసే ఎనిమిది మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వారందరూ ఒడిశా, విజయనగరానికి చెందిన యువకులని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు. మొదట దంపతులు అర్థరాత్రి ఫిర్యాదు చేసేందుకు సత్తైనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే.. ఈ ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ పరిధిలోకి వస్తుందని.. ఫిర్యాదు తీసుకోబోమని పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు వెనుదిరిగి మేడికొండూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.