సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా..? అయితే పిడుగు లాంటి వార్త
Sankranti Special Buses. అసలే కరోనా కారణంగా అతలాకుతలమైన ప్రజానీకానికి మరో చేదువార్త.
By Medi Samrat Published on 31 Dec 2020 4:16 AM GMT
అమరావతి : అసలే కరోనా కారణంగా అతలాకుతలమైన సామాన్యుడికి మరో చేదువార్త. సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపబోయే ప్రత్యేక బస్సులకు సగం ఛార్జీ అదనంగా వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు వివరాలను వెల్లడించారు.
బుధవారం నాడు విలేకరులతో మాట్లాడిన ఆయన.. ప్రయాణాలకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు నిత్యం మరో 48 వేల కి.మీ. మేర సర్వీసులు నడిపేలా చర్చలు జరిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీకి లేఖ రాసినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. కరోనా వల్ల ఇప్పటి వరకు సంస్థ రూ.2,603 కోట్ల మేర రాబడి కోల్పోయిందన్నారు. ఈ ఏడాది సగటు ఓఆర్ 59.14 శాతమే ఉందని.. డిసెంబరు నెలలో ఓఆర్ 70.74 శాతానికి పెరిగిందని తెలిపారు. 2021 మార్చినాటికి సాధారణ పరిస్థితి వస్తుందని వివరించారు. సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల్లో సగం ఛార్జీ అదనంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక 5,586 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడగా.. 91 మంది మరణించారని.. వీరికి కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదన పంపామని తెలిపారు. ఉద్యోగులు ప్రజారవాణాశాఖలో విలీనమైనప్పటికీ, కేడర్ల కేటాయింపు, పేస్కేల్ ఖరారు కోసం వివరాలు పీఆర్సీకి అందజేశామని ఎండీ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు.