మూడు రోజులుగా వారికోసం ఎదురుచూస్తున్నాం : మంత్రి బొత్స

Salaries will be paid according to new PRC, says Botsa Satyanarayana. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ

By Medi Samrat  Published on  31 Jan 2022 2:56 PM GMT
మూడు రోజులుగా వారికోసం ఎదురుచూస్తున్నాం : మంత్రి బొత్స

ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎప్ప‌టిలాగే పాత‌ తేదీన జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పీఆర్సీ జీఓలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆయా అంశాలపై చర్చించేందుకు సీఎంతో మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు సీఎం జగన్‌ను కలిశారు.

అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. జీవో రాగానే ఫిట్‌మెంట్‌, హెచ్‌ఎస్‌ఎ, డీఏతో సహా వేతనాలు చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ చర్చలకు ఉద్యోగ‌ సంఘాలను ఆహ్వానించిందని తెలిపారు. మూడు రోజులుగా వారికోసం ఎదురు చూస్తున్నామని మంత్రి చెప్పారు. ఉద్యోగ సంఘాల డిమాండ్‌ మేరకు ప్రభుత్వం ఒకే తేదీన వేతనాలు చెల్లిస్తోందని బొత్స వివరించారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయం తెలుసుకోకుండా మంత్రుల కమిటీ.. సిఫార్సులు ఎలా చేస్తుందని ప్రశ్నించారు.

ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులకు.. ఇక్కడి నాయకత్వంపై నమ్మకం లేకపోతే ఎలా అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు. బాధ్యతగల వ్యక్తులుగా, రాష్ట్ర ప్రజల సంరక్షకులుగా, మంత్రులు ఎక్కడా బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడం లేదు. ''ప్రజలు, ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు తమ డిమాండ్లను బయటపెట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.




Next Story