ఏపీ లిక్కర్ స్కాం ఆరోపణలపై అరెస్టయిన ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రీధర్‌రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విజయవాడకు తరలించి, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి, శ్రీధర్‌రెడ్డికి మే 6 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారం చేపట్టిన తర్వాత, కొత్త మద్యం విధానం పేరుతో భారీగా అక్రమాలు చేసిందంటూ ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కెసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అదే సంస్థ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ లపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.