ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి శనివారం సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇప్పటికే ఒకసారి సజ్జల జగన్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం మరోమారు సీఎం తో భేటీ అయ్యారు. ఈ నేఫథ్యంలో భేటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన కేబినెట్ ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతుందని.. అన్ని అంశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు సజ్జల తెలిపారు. పాత, కొత్త కలయికతో కేబినెట్ ఉంటుందని స్పష్టం చేశారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం వరకు కసరత్తు కొనసాగుతుందని తెలిపారు.
ఇదిలావుంటే.. ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గవర్నర్, సీఎం జగన్‌తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇటీవల గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ని కలిసి చర్చించారు.