ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరితే ఆలోచిస్తామని సజ్జల వెల్లడించారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే సీఎం జగన్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని.. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే అని అభిప్రాయపడ్డారు. అయితే, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన వైసీపీకి లేదని సజ్జల స్పష్టం చేశారు.
వైసీపీ ఏపీ ప్రజలకు అంకితమైన పార్టీ అంటూ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం తప్ప వేరే ఆలోచన లేదంటూ పేర్కొన్నారు. ఎవరొకరి చంక ఎక్కి గెలవాలి అనుకునే ఆలోచన లేదంటూ స్పష్టంచేశారు. ముందు ఏపీ ప్రయోజనాలు పూర్తి చేసిన తర్వాత వేరే ఆలోచన చేస్తామన్నారు. తమకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని.. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమన్నారు.