ఆ నిషేధం అన్ని పార్టీలకూ వర్తిస్తుంది : సజ్జల

Sajjala Ramakrishna Reddy Fire On TDP. రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన

By Medi Samrat  Published on  3 Jan 2023 10:40 AM GMT
ఆ నిషేధం అన్ని పార్టీలకూ వర్తిస్తుంది : సజ్జల

రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వైసీపీ సహా అన్ని పార్టీలకు వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని మా వరకు పరిమితులు, మిగిలిన వారికి మరో రకంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో వైసీపీకి మినహాయింపు ఉంటుందేమోనని ఎవరూ వర్రీ కావాల్సిన పని లేదని చెప్పారు. ఈ ప్రభుత్వానికి అన్నింటికంటే.. ప్రజల ప్రాణాలే ముఖ్యం అని అన్నారు.

జీవో తీసుకురావడానికి కారణం టీడీపీ వైఖరేనన్నారు. రేపు ఈ జీవోను ఉల్లంఘించి, సభలు నిర్వహిస్తే తర్వాత పరిణామాలను వారే ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అసలు గుంటూరు ఈవెంట్‌ ప్లానింగే సరిగా లేదని.. ఇచ్చిందేమో చెత్త సరుకు. అదీ.. రెండొందలో, మూడొందలో విలువ చేసేవి, కానుకల పంపిణీ పేరిట అమాయక పేద మహిళలను తీసుకొచ్చి, ఆ తర్వాత బాధ్యతా రాహిత్యంగా ఈ దుర్ఘటన నుంచి టీడీపీ తప్పుకోవడం కాని.. ఇవన్నీ ఆ పార్టీ నైజాన్ని చాటుతున్నాయని సజ్జల ఎద్దేవా చేశారు. పైగా టీడీపీ సోషల్‌ మీడియాలో వైసీపీని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సజ్జల విమర్శించారు.

లోకేశ్‌ పాదయాత్ర గానీ, లేదా ఆయన తండ్రి బాబు యాత్రకు గానీ, పవన్‌ కళ్యాణ్‌ బస్సు యాత్రలకు కాని తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ యాత్రలకు వెళ్లే ముందు ఆలోచించాల్సిన విషయమేమంటే.. గతంలో తాము ఏ రకంగా రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం చేశామో, రేపు ఏ రకంగా న్యాయం చేస్తామో చెప్పగలగాలని హితవు పలికారు. అదేవిధంగా తాను గతంలో టీడీపీని ఎందుకు ప్రశ్నించలేదో, ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నాడో పవన్‌కళ్యాణ్‌ తన యాత్రలో చెప్పగలగాలని ఆయన సూచించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేలా ఏడాదిన్నరలో వచ్చే ఎన్నికలకు టీడీపీ, జనసేనలు సిద్ధం కావాలనే తమ పార్టీ ఆశిస్తోందన్నారు. ప్రత్యర్థులు ఎప్పుడూ ధర్మయుద్ధానికి సిద్ధమై ఉండాలనే తామూ కోరుకుంటున్నామని, దొంగయుద్ధం, ముసుగుయుద్ధాలకు కాదన్నారు. ధర్మయుద్ధానికి ఆ పార్టీలను ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. సభలను పబ్లిక్‌ స్థలాల్లో కాకుండా, గ్రౌండ్లను ఎంపిక చేసుకోవాలని పార్టీలకు సూచిస్తున్నామే తప్ప మీటింగులు వద్దని తామేమీ ఆంక్షలు విధించడం లేదని సజ్జల తెలిపారు.


Next Story