'పిఠాపురంలో పవన్‌ను తప్పిస్తారేమో'.. సజ్జల ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

కూటమి పార్టీల్లో తన వాళ్లకే చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

By అంజి  Published on  22 April 2024 9:42 AM GMT
Sajjala Ramakrishna reddy, Chandrababu, Allaince, APnews, APPolls

'పిఠాపురంలో పవన్‌ను తప్పిస్తారేమో'.. సజ్జల ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

కూటమి పార్టీల్లో తన వాళ్లకే చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తప్పించి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను బరిలోకి దింపుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లనే కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలోకి పంపించి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకుంటున్నారు. భీమవరం, అవనిగడల్లో ఇదే జరిగిందని, ఇప్పుడు అనపర్తిలోనూ ఇదే జరుగుతోందని, తర్వాత పిఠాపురంలో జరిగేది కూడా ఇదేనని అన్నారు. చివరికి జనసేనకు 10 టికెట్లకే పరిమితం చేస్తారు కావచ్చని అన్నారు. చంద్రబాబు కోసమే విపక్ష కూటమి ఏర్పడిందని అన్నారు. అతుకుల బొంత కంటే దారుణంగా.. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని.. గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని సజ్జల దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మాట్లాడారు. పవన్‌కు కనీసం రెండు ఏళ్లు అయినా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నదే జనసైనికుల కోరిక అని, చంద్రబాబు పవన్‌కు 24 సీట్లే ఇచ్చారని అన్నారు. ఆపైనా కోతతో జనసేనను 21 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. మొత్తం సీట్లు తన పట్టులో ఉండాలన్నదే చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోందని సజ్జల విమర్శించారు. ఒకవైపు బీజేపీతో మరోవైపు కాంగ్రెస్‌తో చంద్రబాబు జత కట్టారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబుని చూసి ఎవరూ ఓట్లేయరని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా తమ ప్రభుత్వం పని చేసింది. అందుకే మేం ధర్మయుద్ధానికి సిద్ధంగా ఉన్నామని సజ్జల అన్నారు.

Next Story