వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారు : సజ్జల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వార్డు, గ్రామ వాలంటీర్లు సంక్షేమ ఫలాలు అందజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది

By Medi Samrat  Published on  31 March 2024 3:31 PM IST
వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారు : సజ్జల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వార్డు, గ్రామ వాలంటీర్లు సంక్షేమ ఫలాలు అందజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. వార్డు, గ్రామ వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ఆదేశాలపై ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ప్రయోజనాలను పొడిగించడం, పింఛన్ల పంపిణీ, ఇతర సంబంధిత కార్యకలాపాలను వాలంటీర్లతో చేయించకూడదని మీనా అన్నారు. వాలంటీర్లకు ఇచ్చిన సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర పరికరాలను వెంటనే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులకు జమ చేయాలని ఆయన తెలిపారు.

వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయని.. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.వాలంటీర్లపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నాడని.. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబు గిట్టదన్నారు. నిమ్మగడ్డ రమేష్‌ చంద్రబాబు తరపున పనిచేస్తున్నారు. సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే. వాలంటీర్‌ వ్యవస్థ చంద్రబాబు చేతిలో పడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి. చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు. వృద్ధులకు, వికలాంగులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. పవన్‌కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారని తెలిపారు.

Next Story