సీఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

By -  Medi Samrat
Published on : 28 Feb 2026 2:31 PM IST

సీఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన కె.విజయానంద్ శనివారం పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల వేద పండితుల ఆశ్వీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఉ.11.33 గం.లకు సిఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖాధిపతులు, రాష్ట్ర సచివాలయం సహా వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిథులు సిఎస్ కు పుష్పగుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ సహా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సిఎస్ సాయి ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు.

1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ పట్టభద్రులు కాగా 1991 సెప్టెంబరు 15న ఐఏఎస్ కు ఎంపికై 1992 జూన్ నుండి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలక్టర్ గా పని చేశారు.అనంతరం 1993 సెప్టెంబరు నుండి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలక్టర్ గా,1995 ఆగస్టు నుండి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ గా పని చేశారు.అనంతరం 1997 మే నుండి 1998 ఆగస్టు వరకు కడప జాయింట్ కలక్టర్ గా,2000 జూలై నుండి 2003 జూన్ వరకూ కర్నూల్ కలక్టర్ గా, 2003 జూన్ నుండి 2003 అక్టోబరు వరకు చిత్తూరు జిల్లా కలక్టర్ గాప పనిచేశారు.2003 అక్టోబరు నుండి 2004 ఆగస్టు వరకు ఎపి ట్రాన్సుకో జెఎండిగా,2004 ఆగస్టు నుండి 2006 మే వరకు ఇపిడిపిసిఎల్ సిఎండిగా,2006 మే నుండి 2010 ఫిబ్రవరి వరకు ఎపి సిపిడిసిఎల్ సిఎండిగా పని చేశారు.2010 ఫిబ్రవరి నుండి 2011 అక్టోబరు వరకు ఎపి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా పని చేశారు.

అనంతరం 2011 అక్టోబరు నుండి 2014 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.తదుపరి 2014 జూన్ నుండి 2016 ఫిబ్రవరి వరకు సియం కార్యదర్శిగా,2016 ఫిబ్రవరి నుండి 2019 మే వరకు సియం ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. తదుపరి 2020 జనవరి నుండి 2022 ఫిబ్రవరి వరకు ఎపి సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రవేట్ లిమిటెడ్ కు సిఎండి గాను మరియు ఇంధన శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీగాను పని చేశారు. అనంతరం 2022 ఫిబ్రవరి నుండి 2024 జూన్ వరకు సిసిఎల్ఏగా పనిచేశారు. తదుపరి 2024 జూన్ నుండి 2025 జనవరి జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సిఎం ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ప్రస్తుతం సిఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Next Story