రైతులకు బకాయిలు చెల్లింపు కోసం రూ.1,000 కోట్లు విడుదల

దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని మాజీఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు

By Medi Samrat  Published on  4 July 2024 6:15 PM IST
రైతులకు బకాయిలు చెల్లింపు కోసం రూ.1,000 కోట్లు విడుదల

దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని మాజీఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యే కుటుంబం బియ్యం మాఫియాను పెంచి పోషించిందన్నారు. వారం రోజుల్లో రూ. రూ.159 కోట్లు విలువైన 35,404 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని చెప్పారు. పేదల పొట్ట కొట్టి.. కోట్లు దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ప్రతి జిల్లాలో తనిఖీలు చేపట్టి బియ్యం మాఫియాను నిర్మూలిస్తామని అన్నారు.

గత అరాచక పాలనలో రైతులు చితికిపోయారని, రైతుల నుంచి సేకరించిన ఆహారధాన్యాలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని అన్నారు. రైతుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 1000 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. గురువారం, విజయవాడ కానూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. “ఐదేళ్ల గత దురాగత పాలనలో రైతులు అన్ని విధాలా చితికిపోయారు. పంట పండించి నలుగురికీ అన్నం పెట్టే రైతుని నిస్సహాయ స్థితిలోకి గత ప్రభుత్వం, నాయకులు నెట్టేశారు. ఏటా కన్నీటితో బకాయిల కోసం ఎదురుచూపులు చూసే దుస్థితికి తెచ్చారు. రైతుల వద్ద కొన్న ఆహార ధాన్యాలకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా బకాయిలు పెట్టి రైతు ధైర్యం కోల్పోయేలా చేశారు.

పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ని రూ.36,300 కోట్ల అప్పుల పాలు చేశారు. అప్పు చేసినా రైతులకు చెల్లింపులు చేయాలని. రైతాంగానికి రూ.1,659 కోట్లు బకాయిలు వదిలేశారు. ఆహార భద్రత కల్పించే పౌరసరఫరాల శాఖను అప్పులపాలు చేశారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి బకాయిలు వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. రైతుల దగ్గర కొన్న ధాన్యానికి మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వివరించాము. ముఖ్యమంత్రి స్పందించి రైతులను ఆదుకునేందుకు పెద్ద మనసుతో తొలి విడతగా రూ. వెయ్యి కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేశారు. మొదట ఈ రూ. వెయ్యి కోట్లు రైతులకి ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తాం. ముందుగా ధాన్యం ఎవరి వద్ద సేకరించారో గుర్తించి ప్రణాళికాబద్దంగా బకాయిలు చెల్లిస్తాం.

పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.565.95 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.121.96 కోట్లు, కోనసీమ జిల్లాకు రూ.163.59 కోట్లు, కాకినాడ జిల్లాకు రూ.21.92 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.19.96 కోట్లు, బాపట్ల జిల్లాలో రూ.6.61 కోట్ల చొప్పున చెల్లించనున్నాం. సుమారు 50 వేల మంది రైతులకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టాం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పెద్ద మనసుతో స్పందించబట్టి రైతులకు తక్షణ సాయం అందచేయగలుగుతున్నాం. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ రైతు సంక్షేమానికే మా ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తించాలి. రైతులకి మిగిలిన బకాయిలు కూడా కొద్ది రోజుల్లో చెల్లిస్తాం. దీంతోపాటు మరో రూ.2 వేల కోట్ల బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి కూడా ఇటీవలే చెల్లించాము. వచ్చే మార్చి 31 నాటికి మరో రూ. 10 వేల కోట్లు బకాయిలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. బ్యాంకుల నుంచి కూడా సహాయం కోరుతున్నామ‌న్నారు.

Next Story