జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను హత్య చేసేందుకు కొందరు పథకం పన్నారని, 250 కోట్లు సుపారీ ఇచ్చారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అందుకే హైదరాబాద్‌లోని పవన్ ఇంట్లో రెక్కీ నిర్వహించామని తెలిపారు. ఈ రెక్కీపై తాడేపల్లి ప్యాలెస్ హస్తం ఉందని బోండా ఉమా ఆరోపించారు. మీడియాతో టీడీపీ నేత బోండా ఉమా మాట్లాడుతూ.. గర్భిణులు అధికారుల కాళ్లపై పడి వేడుకున్నా ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూల్చివేశారని విమర్శించారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభకు భూమి ఇవ్వడం నేరమా అని ప్రశ్నించారు.
అంతేకాదు సహకరించని ప్రతిపక్షాలపై దాడులు, కుట్రలు, కూల్చివేతలు చేస్తున్నారన్నారు. అవసరమైతే విపక్ష నేతల ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదని బోండా ఉమా షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నంలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు ఆక్రమించారని ప్రశ్నించినందుకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి గోడలు దూకి అయ్యన్న పాత్రుడు కొడుకు రాజేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు.
కమలాపురంలో వక్ఫ్ భూములను ఆక్రమించి సినిమా థియేటర్లు కట్టిన సీఎం జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా నందిగామలో చంద్రబాబుపై దాదాపు 15 రాళ్లు రువ్వారు. అదృష్టవశాత్తూ చంద్రబాబుకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ సీఎస్‌వోకు గాయాలయ్యాయని అన్నారు. ఈ ఘటన స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వారి అనుచరుల పనే అని ఆరోపించారు. చంద్రబాబుపై హత్యాయత్నం కేసులో స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.