ఏపీలో ప్రధాని మోదీ టూర్ కోసం రూ.15 కోట్లు విడుదల
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు
By - Knakam Karthik |
ఏపీలో ప్రధాని మోదీ టూర్ కోసం రూ.15 కోట్లు విడుదల
అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా జీఎస్టీ తగ్గింపు ప్రచారం, కార్యక్రమం కోసం ప్రధాని మోదీ కర్నూల్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ ప్రచారంలో భాగంగా ప్రధాని నిర్వహించే రోడ్ షోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం నిధులు విడుదల చేస్తూ సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు జారీచేసింది.
ఇదే ప్రధాని టూర్ షెడ్యూల్...
ఈ పర్యటనలో ప్రధాని మోదీ... శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హజరవుతారు. ప్రధాని మోదీ అక్టోబర్ 16వ తేదీ ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు బయలుదేరుతారు. ఉదయం 10.20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ప్రధాని మోదీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంటకు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాగ మయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగనుంది. అనంతరం ప్రధాని మోదీ కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.