ఆ లెక్క చెప్పండి.. చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు..!

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల నుంచి పొందిన రూ.118 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని కలిగి ఉన్నందుకు

By Medi Samrat  Published on  1 Sep 2023 3:42 PM GMT
ఆ లెక్క చెప్పండి.. చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు..!

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల నుంచి పొందిన రూ.118 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని కలిగి ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

హైదరాబాద్‌లోని ఐటీ సెంట్రల్ సర్కిల్ జారీ చేసిన షోకాజ్ నోటీసులలో.. ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్నటువంటి షాపూర్‌ జీ పల్లోంజి కంపెనీ ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పలు కాంట్రాక్ట్‌లు దక్కించుకుందని తెలిపింది. అదే సమయంలో ఈ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్‌లు అప్పగించిన సంస్థల నుంచి కిక్‌ బాక్స్‌ రూపంలో 118 కోట్ల రూపాయలు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబుకు అందినట్లుగా ఓ జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. దీనిపైనే ఐటీ అధికారులు సెక్షన్‌163C కింద షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఐటీ నోటీసులు 2023 ఆగస్టు 4న జారీ కావాల్సి ఉండగా.. సెప్టెంబర్ 1న హిందూస్థాన్ టైమ్స్‌లో ప్రచురితమైన నివేదిక కారణంగా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు నాయుడును ప్రస్తావిస్తూ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. షాపూర్‌ జీ పల్లొంజీ సంస్థ ప్రతినిధుల్లో ఒకరైన మనోజ్‌ వాసుదేవ్ పార్ధసాని నివాసాల్లో ఐటీశాఖ సోదాల్లో బయటపడినట్లుగా తెలుస్తోంది. బోగస్ కాంట్రాక్ట్‌లు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు చేతులు మారినట్లుగా మనోజ్‌ వాసుదేవ్ ఒప్పుకున్నారనే విషయాన్ని కూడా హిందూస్థాన్ టైమ్స్‌ ప్రచురించింది. ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి వచ్చిన ఇంత పెద్ద మొత్తం డబ్బు గురించి లెక్కలు చెప్పాలనే కారణంగానే చంద్రబాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు ముట్టినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలింది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్న రాజకీయ వర్గాలకు ఈ నోటీసులు షాకిచ్చాయి. చంద్రబాబు నాయుడు ప్రకటించిన రాజధాని అమరావతిలో లంచాలు, అవినీతికి సంబంధించి YSRCP ఆరోపణలను గుప్పిస్తూ వస్తుండగా.. ఇప్పుడు ఈ ఐటీ నోటీసులు వైసీపీ నాయకులకు ఓ అస్త్రంగా మారాయి.

షోకాజ్ నోటీసులు వెలుగులోకి రావడంతో వైఎస్సార్సీపీ చంద్రబాబు నాయుడుపై మూకుమ్మడి దాడికి దిగింది. చంద్రబాబు రహస్యాన్ని ఆదాయపు పన్ను శాఖ బయటపెట్టిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. మౌలిక సదుపాయాల సబ్‌ కాంట్రాక్ట్‌ల పేరుతో రూ.118 కోట్ల లంచం తీసుకున్నాడని.. ఆంద్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానన్న పేరుతో డబ్బులన్నీ జేబులో వేసుకున్నాడని ఆరోపించారు. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని.. ఇప్పుడు ఎవరికీ చూపించడానికి చంద్రబాబుకు ముఖం లేదని అన్నారు. మరోవైపు టీడీపీ మాత్రం ఈ విషయంపై మౌనంగానే ఉంది.

షాపూర్జీ పల్లోంజీ కొత్త రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు అటల్ టన్నెల్, AP-తెలంగాణ సెక్రటేరియట్‌లను నిర్మించిన ప్రఖ్యాత సంస్థ. గుంటూరులో రూ.960 కోట్లతో సిసి, బిటి రోడ్ల ప్రాజెక్ట్‌ను కూడా పొందింది. లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) అమరావతికి బేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 9,000 కోట్లు, ఇందులో రోడ్లు, వంతెనలు, మురుగునీటి కాలువలు వంటివి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రాజెక్టుల టెండర్లను దక్కించుకోడానికి L&T, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలు పోటీ పడ్డాయి. 2016లో తాత్కాలిక సచివాలయ నిర్మాణం, 2017లో అమరావతి హౌసింగ్ ప్రాజెక్ట్‌ లో భాగమయ్యారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి, ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత వారి ప్రాజెక్టులు నిలిచిపోయాయి.

Next Story