అమరావతి: పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. AMRUT 2.0 పథకం కింద 281 పనులకు రూ.10,319.93 కోట్లకు పరిపాలనా ఆమోదం తెలుపుతూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా APUFIDC, పబ్లిక్ హెల్త్, గ్రీన్ బిల్డింగ్స్ కార్పొరేషన్ లకు పనుల నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో కేంద్రం నుంచి రూ.2,470 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2,490 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.925 కోట్లు, పట్టణాల వాటా రూ.590 కోట్లు, అంతా కలిపి ప్రాజెక్టు క్యాపెక్స్ రూ.6,477 కోట్లు.. దీనికి 10 సంవత్సరాల నిర్వహణ ఖర్చు రూ.1,499 కోట్లు, వడ్డీ ఖర్చు రూ.2,344 కోట్లు కాగా మొత్తం ప్రాజెక్టు విలువ రూ.10,319.93 కోట్లు అని తెలిపింది.
పనులు తీసుకునే సంస్థలు ఒప్పందం సమయంలో కొంత మొత్తం సెక్యూరిటీ ఇవ్వాలన్న నిబంధన పెట్టింది. పనులు సాగుతున్నప్పుడు కట్ చేయకుండా మాఫీ చేయొచ్చని అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, పట్టణాల వాటా కోసం అవసరమైన నిధులను సేకరించేందుకు APUFIDCకి అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్ర పట్టణాభివృద్ధి చరిత్రలో అతి పెద్ద పెట్టుబడి ప్రాజెక్ట్‌గా రికార్డు సృష్టించింది.