అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎన్జీవో కాలనీలోని రెండు ఇళ్లలో దొంగలు పడ్డారు. ఇంట్లోని మహిళలపై దాడి చేసి బంగారాన్ని అపహరించుకుపోయారు. ఉపాధ్యాయులు శంకర్ రెడ్డి, ఉషారాణి, టీ స్టాల్ ఓనర్ రమణలవి పక్క పక్క ఇళ్లే. ఈ రెండు ఇళ్లో దోపిడీ దొంగలు ప్రవేశించి రెచ్చిపోయారు. ఉదయం శంకర్ రెడ్డి వాకింగ్ కోసం బయటకు వెళ్లాడు. అదే సమయంలో దొంగలు శంకర్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో శంకర్ భార్య ఉషారాణి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. చోరీ చేసే క్రమంలో ఆమె అరుస్తుందనుకొని తలపై గట్టిగా కొట్టారు. దీంతో ఉపాధ్యాయురాలు ఉషారాణి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత ఆమె మెడలోని బంగారు గొలుసును చోరీ చేశారు.
ఆ వెంటనే పక్కింట్లో ఉండే రమణ ఇంట్లోకి ప్రవేశించారు. రమణ భార్య శివమ్మపై దాడి చేసి మెడలోని బంగారం అపహరించుకుపోయారు. ఈ ఘటనలో శివమ్మకు తీవ్ర గాయాలు అయ్యియి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దోపిడీ దొంగలు సృష్టించిన బీభత్సంతో కదిరి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఉషారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో దొంగల కోసం గాలిస్తున్నారు. దొంగల దాడిలో ఉపాధ్యాయురాలు ఉషారాణి మృతి చెందడంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.