ఎట్టకేలకు ఆర్కే రోజాకు మంత్రి పదవి లభించింది. వైసీపీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రోజా పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నారు. గతంలోనే మంత్రి పదవి వస్తుందని ఆశించిన రోజాకు అప్పట్లో నిరాశ ఎదురైనా.. ఇప్పుడు మాత్రం ఆమెను మంత్రి పదవికి ఎంపిక చేశారు. ఆమె రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి లభించినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై తన అభిమానం రెట్టింపయిందని.. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖను కేటాయించినా సమర్థవంతంగా పని చేస్తానని తెలిపారు. సినిమాలకు, జబర్దస్త్ షోకు గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. మంత్రిగా తన పూర్తి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని, ఈ సమయంలో సినిమాలు, టీవీ షోలకు సమయం కేటాయించలేనని ఆమె తెలిపారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు.
ఏపీ కొత్త మంత్రివర్గం పాత, కొత్త కలయికగా ఉండబోతోంది. పాత మంత్రుల్లో 11 మందిని మళ్లీ అదృష్టం వరించింది. ఈ సారి కూడా జగన్ కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని తెలుస్తోంది. గత కేబినెట్లో ఎస్సీ, మైనార్టీ విభాగంలో ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన నారాయణస్వామి, అంజాద్ బాషాలకు తిరిగి డిప్యూటీ సీఎం పదవుల్లో కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎస్టీ కోటాలో రాజన్నదొరకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. బీసీ కోటాలో ధర్మాన ప్రసాదరావు పేరు వినిపిస్తోంది.