ములుగు నియోజక వర్గం మేడారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం అయ్యింది. వనదేవతలు సమ్మక్క, సారాలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి.. దేవతల ఆశీర్వాదాలు తీస్కొని రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఒక్క పిలుపుతో ఇంత మంది తరలిరావడం చూస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మీలో ఎంత ఉత్సాహం ఉందో అర్ధమవుతోంది. ఆదివాసుల హక్కుల కోసం ఆనాడు సమ్మక్క సారక్క పోరాడి అమరులయ్యారు. ఆ వనదేవతల ఆలయం నుంచి సోదరుడు యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.
నేను పేదింటి బిడ్డనైనా.. నన్ను మీరంతా అక్కున చేర్చుకున్నారు. మూడు తరాలతో అక్కా అని అప్యాయంగా పిలిపించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే వరకు చేతిలో చేయి వేసి.. అడుగులో అడుగేయాలి అని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి వస్తున్నాడని తెలిసి పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాత్రికి రాత్రి చాటింపు వేస్తుండ్రు. కాంగ్రెస్ అంటేనే లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన పార్టీ.. పేదలకు బతుకుదెరువు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.. అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీతక్క అన్నారు.