నాయకుల మీద అభిమానం ఉంచుకోవాలని, అయితే దాన్ని గుండెల్లో పెట్టుకుని ఉంచుకుంటే ఇంకా మంచిదని ఓ వైసీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పుంగనూర్‌లో పుంగనూర్ బీఎంఎస్ క్లబ్ ఆవరణలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆత్మయ సత్కారం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ బలిజ అభిమాని సభ వేదికపైకి వెళ్లాడు. దీంతో స్థానిక సీఐ గంగిరెడ్డి తనను అడ్డుకొని తోసేశాడని, పక్కనే ఉన్న శ్రీకృష్ణదేవరాయుల విగ్రహంపై పడటంతో తన తలకు గాయం అయ్యిందని పుంగనూరు పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్త అమ్ముకుట్టి ఆలియాస్ మహబూబ్ బాషా చెప్పాడు.
తలకు గాయమైనా ఎవరూ పట్టించుకోకపోగా, హాస్పిటల్‌కి కూడా తరలించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బలిజల సమావేశంపైనా అభిమానంతో వెళ్లానని చెప్పాడు. సభా వేదిక ఎక్కిన తనను సీఐ గంగిరెడ్డి రాకూడదని అనడం చాలా బాధకరమని అన్నాడు. ఇదే విషయమై సీఐ గంగిరెడ్డి స్పందిస్తూ.. సభా వేదికపై చాలా మంది ఉండటంతో కిందకు దిగాలని చెబుతూ వచ్చానన్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు, నాయకులు దిగుతుండగా రద్దీలో అతడు శ్రీకృష్ణదేవరాయులు విగ్రహంపై పడ్డాడని తెలిపారు. మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి వెనుక ఎవ్వరూ ఉండవద్దని మాత్రమే చెప్పానన్నారు. ఎక్కడా కూడా మతాల పేరు ఎత్తలేదని సీఐ చెప్పారు.