42 నుంచి 26 నిమిషాలకు తగ్గిన ఓపీ సేవల సమయం
కూటమి ప్రభుత్వం జూన్ 2024లో అధికారంలోకొచ్చినప్పట్నించి ప్రభుత్వ వైద్య రంగాన్ని మెరుగుపరచడానికి చేపట్టిన ప్రయత్నాలు సానుకూల ఫలితాల్ని ఇస్తున్నాయని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
By - Medi Samrat |
కూటమి ప్రభుత్వం జూన్ 2024లో అధికారంలోకొచ్చినప్పట్నించి ప్రభుత్వ వైద్య రంగాన్ని మెరుగుపరచడానికి చేపట్టిన ప్రయత్నాలు సానుకూల ఫలితాల్ని ఇస్తున్నాయని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26) మొదటి 6 నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) ఈ దిశగా చేసిన ప్రయత్నాలు, మార్పులను ఉన్నతాధికారులతో మంత్రి సమగ్రంగా సమీక్షించారు. వివిధ శాఖల పనితీరు, పథకాల అమలుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని తెప్పించుకున్న మంత్రి అనుకూల, ప్రతికూల అంశాల్ని నిశితంగా గమనించారు.
గతేడాది అధికారంలోకొచ్చిన వెంటనే వైద్యారోగ్య రంగంలో నెలకొన్న పరిస్థితుల్ని గమనించి, ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యల ఫలితాలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిరంతరం పర్యవేక్షణతో వ్యవస్థలో జవాబుదారితనం కోసం చేసిన కృషి మంచి ఫలితాల్ని ఇవ్వడం పట్ల ఒక ప్రకటనలో మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు. అయితే వ్యవస్థ పూర్తి ప్రక్షాళన కోసం చేయాల్సినది ఇంకా చాలా ఉందని, ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు.
వైద్య సిబ్బంది హాజరు, ఓపీ మరియు ఐపి సేవల్లో పురోగతి, డయాగ్నొస్టిక్ సేవల రాశిలో ప్రగతి, ఆరోగ్య పథకాల అమలులో వచ్చిన మార్పు ఆశాజనకంగా ఉన్నాయని మంత్రి అన్నారు.
మొదటిసారిగా మూల్యాంకన వ్యవస్థ
అధికారంలోకొచ్చినప్పట్నించి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా సంక్రమించిన లోపాలు, సమస్యలను సవరించడంపై మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ దృష్టి పెట్టారు. క్రమశిక్షణారాహిత్యం, జవాబుదారితనం లోపించడంపై ఆందోళన చెందిన మంత్రి మార్పుకోసం వివిధ విభాగాల పనితీరు, పథకాల అమలు మదింపు కోసం ఒక పటిష్టమైన, సమగ్రమైన మూల్యాంకన వ్యవస్థను గతేడాది నవంబరులో ప్రవేశపెట్టారు. దీని ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలల కాలంలో వివిధ జిల్లాల పనితీరు, పథకాల అమలు, డివిజన్లకు ర్యాంకులివ్వాలని మంత్రి ఆదేశించారు. ఈ మూల్యాంకనం ఆధారంగా వాటిని మంత్రి సమీక్షించారు.
వైద్య సిబ్బంది హాజరు
ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు ఈ ఏడాది ఏప్రిల్‌లో 83 శాతం నుంచి సెప్టెంబరు నాటికి 92 శాతానికి పెరిగినట్లు గమనించిన మంత్రి హర్షాన్ని వెలిబుచ్చారు. ఈ కాలంలో సగటు హాజరు 87 శాతంగా నమోదైంది. నర్సులు, పారా మెడికల్ సిబ్బంది హాజరు 90 శాతానికి పైగా ఉండగా...వైద్యుల హాజరు 82 శాతం మాత్రమే ఉండటాన్ని గమనించిన మంత్రి తగు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.
జిజిహెచ్‌లలో హాజరు
డాక్టర్లు, ఇతర సిబ్బంది హాజరులో విశాఖపట్నంలోని కెజిహెచ్( 93.13 శాతం) , కర్నూలు జిజిహెచ్( 92.71 శాతం), రాజమహేంద్రవరం జిజిహెచ్(91.46 శాతం) హాజరుతో అగ్రస్థానంలో నిలిచాయి. తక్కువ హాజరు నమోదైన జిజిహెచ్‌లుఃనెల్లూరు జిజిహెచ్(66.44 శాతం), ఏలూరు జిజిహెచ్(76.30 శాతం), గుంటూరు జిజిహెచ్(77.84 శాతం). హాజరు విషయంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజీ (100 శాతం), కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్(99.92 శాతం), విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ (95.30 శాతం)తో ముందు వరుసలో ఉన్నాయి. దాదాపు 80 శాతం హజరుతో విజయవాడలోని సిద్దార్ధ మెడికల్ కాలేజీ, శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు గుంటూరు జిఎంసి వెనుకబడ్డాయి. కొత్తగా స్థాపించిన 6 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో హాజరుపై దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు. డిఎంఇ మరియు అనుబంధ సంస్థలు, నర్సింగ్ కళాశాలల్లో హాజరు తక్కువగా ఉండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
త్వరగా ఓపీ సేవలు
ఈ 6 నెలల కాలంలో 20 శాతానికి పైగా వృద్ధితో ప్రభుత్వ వైద్య శాలల్లో మొత్తం 4 కోట్లకు పైగా ఓపీ సేవలు అందించబడ్డాయి. ముఖ్యంగా ఓపీ సేవలందించడానికి ఇంతకుముందు సగటున రోగికి 42 నిమిషాలు పట్టగా ఈ సమీక్షా కాలంలో అది 26 నిమిషాలకు తగ్గడంపై మంత్రి సంతోషాన్ని వెలిబుచ్చారు. ఓపీ మరియు అభా రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఈ కాలంలో భారీగా పెంచడం వల్ల ఇది సాధ్యమైందని ఆయన గమనించారు. 2024లో జిజిహెచ్‌ల్లో కేవలం 80 ఓపీ కౌంటర్లు మాత్రమే ఉండగా ఈ ఏడాది సెప్టెంబరు నాటికి అవి 150కి పెరిగాయి. అభా కౌంటర్లు 53 నుండి 116కు పెరిగాయి.
ఈ సమీక్షా కాలంలో మొత్తం 2.50 కోట్ల మేరకు ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, ఇసిజి మరియు ల్యాబ్ టెస్టులు చేయబడ్డాయి. ఈ విషయంలో 6.10 శాతం వృద్ధి నమోదైంది.
జిల్లాల పనితీరు
పలు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ఎం) పథకాల అమలులో తూర్పు గోదావరి, కడప, తిరుపతి జిల్లాలు అగ్రస్థానంలో నిలవగా అల్లూరి సీతారామరాజు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడ్డాయి. డివిజన్ల పనితీరు ప్రకారం డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం, మాతా శిశు ఆరోగ్య విభాగం అగ్రస్థానంలో నిలవగా అసంక్రమణ వ్యాధుల విభాగం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బిఎస్కే) వెనుకబడినట్లు మంత్రి గమనించారు.
డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం కింద టిబి, కుష్టు, హెపటైటిస్, వ్యాధులు ప్రబలడంపై నిఘా, అంధత్వ నివారణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ దిశగా సత్ఫలితాలను సాధించడంపై మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అసంక్రమిక వ్యాధులకు సంబంధించి భారీ స్థాయిలో స్క్రీనింగ్ జరుగుతున్నా ఈ వ్యాధులబారిన పడిన వారికి తగు చికిత్సలు అందించడంలో లోపం కనపడుతోందని, దీనిని సవరించాలని మంత్రి ఆదేశించారు.
మొదటిసారిగా చేపట్టిన మూల్యాంకన వ్యవస్థ ఫలితాల ఆధారంగా వెల్లడైన లోపాలను సరిదిద్దుకోడానికి తగు చర్యలు చేపట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.