చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని కోరుతున్న రవిబాబు

టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ పై సినీ నటుడు, దర్శకుడు రవిబాబు స్పందించారు.

By Medi Samrat
Published on : 30 Sept 2023 3:05 PM IST

చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని కోరుతున్న రవిబాబు

టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ పై సినీ నటుడు, దర్శకుడు రవిబాబు స్పందించారు. ప్రజల సొమ్ము కోసం కక్కుర్తిపడే రకం చంద్రబాబు కాదని.. ప్రజల కోసం తపన పడే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి ఎందుకు హింసిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు వేయడం సహజమేనని, 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన రాజకీయ ఎత్తుగడో తనను అర్థం కావడం లేదన్నారు. ఏ పవర్ నైతే ఉపయోగించి చంద్రబాబును జైల్లో పెట్టించారో, అదే పవర్ ను ఉపయోగించి ఆయనను వదిలేయాలని విన్నవించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు విచారించుకోవాలని సూచించారు. చంద్రబాబును వదిలేస్తే మిమ్మల్ని జాలి మనసు, విలువలు ఉన్న వ్యక్తుల్లా చరిత్ర గుర్తుంచుకుంటుందన్నారు. మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదని.. రాజకీయ నాయకుల పవర్ కానీ, సినిమా వాళ్ల గ్లామర్ కానీ శాశ్వతం కాదని తెలిపారు.

ఎన్టీ రామారావు, చంద్రబాబు కుటుంబాలు తమ కుటుంబానికి ఆప్తులని రవి బాబు అన్నారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని.. చంద్రబాబు ఏ పని చేయాలన్నా వంద యాంగిల్స్ లో ఆలోచిస్తారని, అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఆయనకి భూమి మీద ఇవాలే ఆఖరి రోజు అని తెలిసినా కూడా కూర్చొని వచ్చే 50 సంవత్సరాలకు సామాజిక అభివృద్ధి గురించి ప్లాన్లు వేస్తారు. ఆయన డబ్బు కోసం కక్కుర్తిపడే మనిషి కాదని అన్నారు రవి బాబు.

Next Story