వేగంగా నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు..22 మంది సురక్షితంగా భారత్‌కు

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగంవంతంగా కొనసాగుతోంది.

By -  Knakam Karthik
Published on : 11 Sept 2025 11:56 AM IST

Andrapradesh, Amaravati, AP residents stranded in Nepal,  India

అమరావతిః రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగంవంతంగా కొనసాగుతోంది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిన్న ఏపీ భవన్, ఎంబసీ అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి జరిపిన నిరంతర సమీక్ష సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే నేపాల్‌లో చిక్కుకున్న పలువురు ఏపీ వాసులు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. మరికొందరు భారత సరిహద్దుల వద్దకు చేరుకున్నారు. మొదటగా హేటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది బీహార్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు.

అదేవిధంగా సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మందిని ఉదయం 9 గంటలకు భారత సరిహద్దులోని నేపాల్ గంజ్ కు తరలించారు. అక్కడి నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తరలించనున్నారు. లక్నో నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో పంపే ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. నేపాల్‌లోని పోక్రాకు ప్రత్యేక విమానం ఈ ఉదయం 9.30కి చేరుకుంది. ఏపీ వాసులతో 10 గంటలకు ఖాట్మాండు వైపు బయలుదేరింది. ఖాట్మాండు విమానాశ్రయానికి ఇప్పటివరకు 133 మంది ఏపీ వాసులు చేరుకున్నారు. మరో 43 మంది మార్గమధ్యలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానం ఈ ఉదయం 9.30 గం.లకు ఢిల్లీ నుంచి బయలుదేరింది.

నేపాల్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు. ఏపీ వాసులకు అవసరమైన ఆహారం, నీరు, ఇతర సౌకర్యాల కల్పనకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేయడం జరిగింది. ఢిల్లీలోని ఏపీ భవన్ ఏర్పాటుచేసిన అత్యవసర హెల్ప్ లైన్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు గమనిస్తున్నారు. ప్రత్యేక విమానాల కోసం పౌర విమానాయాన మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు. వివిధ గ్రూపులుగా నేపాల్‌లోని 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు చిక్కుకున్నారు. వీరంతా ఖాట్మాండు, హేటౌడా, పోక్రా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చి.. వారిని స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం పూర్తిచేసింది.

Next Story