ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. నీట మునిగిన పంటలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు

ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. నీట మునిగిన పంటలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు

By అంజి  Published on  20 July 2024 8:23 AM IST
Rains, Andhra Pradesh, Crops, APnews, IMD

ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. నీట మునిగిన పంటలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు

అమరావతి: వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలం అవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని అన్ని జిల్లాల్లో విలయం అంతా ఇంతా కాదు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. కట్టలకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు దీవులను తలపిస్తున్నాయి. కొండప్రాంతాల్లో చరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా పి.గన్నవరం పరిధిలోని గంటిపెదపూడి శివారు బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఉడిమూడి శివారు ఉడిమూడిలంక గ్రామస్తులు ఇంజన్‌ పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. వేల ఎకరాల్లోవరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి. చింతూరు, వీఆర్‌పురం మండలాల ప్రధాన రహదారిపై జల్లేరు గూడెంవాగు పొంగి ప్రవహిస్తోంది.

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లూరి, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, కృష్ణా, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం సెలవు ఉంటుందని కలెక్టర్లు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా జిల్లాల్లో అధికారులు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు.

ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురువనున్నాయి. కాకినాడ, కోనసీమ అంబేద్కర్ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా. బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.

Next Story